అందరికీ మెరుగైన వైద్యసేవలు 

30 Jun, 2020 13:05 IST|Sakshi
పులివెందుల ప్రభుత్వ మెడికల్‌ కళాశాల స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి ఆళ్ల నాని, డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష, ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ తదితరులు

వైఎస్‌ ఆశయాలకు అనుగుణంగా మెడికల్‌ కళాశాల ఏర్పాటు  

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని  

ఆగస్టులో కళాశాల నిర్మాణాలకు టెండర్లు  

పులివెందుల రూరల్‌: అందరికీ మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లకాళీ కృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన తనయుడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరుగుతుందని వివరించారు. సోమవారం ముద్దనూరు రోడ్డులోని జెఎన్‌టీయూ కళాశాల సమీపంలో వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి సంబంధించి స్థలాన్ని మ్యాప్‌లను, నమూనాలను కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పులివెందులలో నిర్మించే మెడికల్‌ కళాశాలకు స్థలాన్ని పరిశీలించినట్లు చెప్పారు.

అలాగే  ప్రతి గ్రామానికి 104, 108 వాహనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 25 పార్లమెంట్‌ సెగ్మెంట్లలోని 11 స్థానాల్లో మెడికల్‌ కళాశాలలు ఉన్నాయని... కొత్తగా 15 కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం అనుమతి ఇచ్చారన్నారు. ఏడాదిలో 15 సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. రూ.345 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఆగస్ట్‌ నెలలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. కరోనాకు సంబంధించి పరీక్షలు చేసేందుకు అనుగుణంగా ల్యాబ్‌లు, మిషన్లు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాని మంత్రి ఆళ్ల నాని వివరించారు.  

కుటుంబ నియంత్రణ ఆసుపత్రి ఏర్పాటు చేయండి..
పులివెందుల ప్రాంతంలో కుటుంబ నియంత్రణకు సంబంధించి ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఏఎన్‌ఎంలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌కు వినతి పత్రం ఇచ్చారు. వైద్యులను నియమించాలన్నారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ హరికిరణ్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఏపీఎంఎస్‌ ఐడీసీ ఇంజనీర్‌ సత్యప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ నాగన్న, మున్సిపల్‌ ఇన్‌ఛార్జి వైఎస్‌ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వరప్రసాద్, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చిన్నప్ప, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ దివిజ, వైఎస్సార్‌సీపీ నాయకులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు