మైనర్ ఇరిగేషన్ శాఖలో వేటు

31 May, 2014 02:14 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప : మైనర్ ఇరిగేషన్ శాఖలో అక్రమార్కులపై వేటు పడింది. నిబంధనలకు పాతర వేస్తూ అయిన వారిని అందలం ఎక్కిస్తూ అడ్డగోలుగా కాంట్రాక్టు పనులు అప్పగించిన నేరానికి శిక్ష పడింది. ఇరువురు డీఈలు, నలుగురు ఏఈలు, నలుగురు జేటీఓలను సస్పెండ్ చేస్తూ  శుక్రవారంసాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  2009-12 కాలంలో రైల్వేకోడూరు నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ పనులను ఇబ్బడిముబ్బడిగా, ఇష్టారాజ్యంగా చేపట్టారు. రైల్వేకోడూరు, చిట్వేలి మండలాలలో రూ. 4 కోట్లతో పలు చెక్‌డ్యామ్‌లు, కుంటలను అభివృద్ధి పరిచారు.  
 
 నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టు పనులు అప్పగించడం, నాణ్యతగా  పనులు నిర్వహించకపోవడం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.  వీటిపై అప్పట్లోనే ఆరోపణలు రావడంతో  ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సాయిరాంప్రసాద్ రెండు నెలల క్రితం సస్పెండ్‌కు  గురయ్యారు.  అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 103 ఇరిగేషన్ పనులపై విచారణ చేపట్టారు. అందులో నల్గొండ జిల్లాలో 70 పనులు, వైఎస్సార్‌జిల్లాలో 30 పనుల్లో అవకతవకలకు  జరిగినట్లు  రూఢీ అయింది. ఈ మేరకే సస్పెన్షన్ ఉత్తర్వులు అందినట్లు సమాచారం.
 
 అనుకున్న వారికే కాంట్రాక్టు పనులు
 మైనర్ ఇరిగేషన్ శాఖలో టెండర్ల ప్రక్రియను తంతుగా నిర్వహించేవారు. అనుకున్న వారికి కాంట్రాక్టులు దక్కేలా పాత తేదీలతో టెండర్లను ఆహ్వానిస్తూ అప్పటికప్పుడు నోటీసు బోర్డులో పొందుపరుస్తూ వచ్చేవారు. ఇరిగేషన్ అధికారులతో టచ్‌లో ఉన్న వారికి మాత్రమే పనులు దక్కేలా, అలాంటి వారికే టెండరుషెడ్యూల్ అందేలా ముందస్తు వ్యూహంతో వ్యవహరించేవారు.  అనుకున్న వారికి కాంట్రాక్టు పనులు అప్పగించడం, ఆపై పరస్పర సహకారంతో పనులు చేపట్టడంతో నాణ్యతకు తిలోదకాలకు ఇస్తూ వచ్చారు. ఈ నేపధ్యంలో మైనర్ ఇరిగేషన్‌శాఖ కార్యదర్శినాగిరెడ్డి, చీఫ్ ఇంజినీర్లకు రైల్వేకోడూరు వాసులు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు సాయిరాంప్రసాద్‌పై తొలుత వేటు పడింది.  సమగ్ర విచారణ అనంతరం డీఈలు రాజా రవీంద్ర, చెంగల్‌రాయులు, ఏఈలు రెడ్డి సురేష్, లక్ష్మినరసయ్య, వెంకట సుబ్బయ్య, ప్రసాద్, టెక్నికల్ ఆఫీసర్లు సుదర్శన్‌రెడ్డి, నాయక్, వెంకట సుబ్బయ్యతో పాటు  మరొకరిపై సస్పెన్షన్ వేటు పడినట్లు  సమాచారం.


 సీబీసీఐడీచే విచారణ
 రైల్వేకోడూరు, చిట్వేలి మండలాల్లో 2009-12 కాలంలో  చేపట్టిన సుమారు రూ. 4 కోట్ల కాంట్రాక్టు పనులపై సీబీసీఐడీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అందుకు నోడల్ ఆఫీసర్లుగా ప్రస్తుత ఈఈలు సుబ్బరామయ్య, మల్లికార్జునను నియమించారు.  అప్పట్లో చోటుచేసుకున్న అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది. ఆ మేరకు సుమారు 30 పనులపై సమగ్ర విచారణ చేపట్టినట్లు  తెలుస్తోంది. అందులో భాగంగానే మైనర్ ఇరిగేషన్‌లో 10 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు పడ్డట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఆ శాఖ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
 

మరిన్ని వార్తలు