ఇదెక్కడి న్యాయం?

22 May, 2015 04:23 IST|Sakshi
ఇదెక్కడి న్యాయం?

రుణవిముక్తి చేయలేనన్న ఎమ్మెల్యే సూరి
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు
నోర్మూయ్ అంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సూరి

 
 ధర్మవరం అర్బన్ : చలిచీమలు ఏకమయ్యాయి... బానిస సంకెళ్ళ నుండి విముక్తి అయ్యేందుకు వేలాదిమంది కార్మికులు ఒక్కటౌతున్నారు. తమ బతుకులు నాశనమయ్యాయని, రుణ విముక్తి కల్పించాలని ఏకంగా స్థానిక ఎమ్మెల్యేను కూడా నిలదీసే స్థితికి చేరుకున్నారు. వివరాలలోకి వెళితే... ధర్మవరం పట్టణంలోని చేనేత యజమాని గడ్డం సాయి అరాచకాలను ఎండగట్టాలని, వారి నుండి తమకు విముక్తి ప్రసాదించాలని కోరుతూ... సుమారు 250 చేనేత కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి.

బుధవారం రాత్రి ఎమ్మెల్యే సూర్యనారాయణ ఇంటి వద్ద ధర్నా చేసిన కార్మికులు గురువారం కూడా తమ ఆందోళనలను కొనసాగించారు. ఉదయం 10గంటలకే ఆర్‌డిఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు, ఆర్‌డిఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ రక్షణ కల్పించాలని, బానిస సంకెళ్ళ నుండి విముక్తి ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ విషయంపై ఆర్‌డిఓ నాగరాజు సరైన వివరణ ఇవ్వకపోవడంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఆర్‌డిఓ కారును అడ్డుకున్నారు. దీంతో దిగివచ్చిన ఆర్‌డిఓ మీకు జరిగిన అన్యాయంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కోరారు.

వీటిపై తమకు జరిగిన అన్యాయాలని లేఖలో రాసి ఆర్‌డిఓ కార్యాలయ అధికారికి అందజేశారు. కార్మికుల ప్రాణాలను దోచుకు తింటున్న గడ్డం సాయిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు అక్కడి నుండి తిరిగి వెళ్ళే సమయంలో అదే మార్గంలో ఎమ్మెల్యే రావడంతో ఆయన కారును అడ్డుకున్నారు. అయినా కూడా కారు డ్రైవర్ నిలపకుండా వెళ్ళడంతో కార్మికులు ఎమ్మెల్యే డౌన్... డౌన్... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారును వెంబడించారు.

అక్కడి నుండి ఎమ్మెల్యే మినీ మహానాడు కార్యక్రమాలను పరిశీలించేందుకు రావడంతో అక్కడికి చేరుకున్న కార్మికులు గడ్డం సాయి ఆగడాలను అరికట్టాలని తమను బంధ విముక్తులను చేయాలని ప్రాధేయపడ్డారు. ఈ విషయంపై యజమానితో చర్చించి న్యాయం చేస్తానని చెప్పినా ఆందోళనకారులు ఏ మాత్రం వినలేదు. దీంతో చేసేది లేక ఎమ్మెల్యే సరాసరి గడ్డంసాయి ఇంటి వద్దకే వెళ్ళారు. అక్కడికి చేనేత కార్మికులు చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది.

రూరల్ ఎస్‌ఐ సుబ్బరాయుడు, కార్మికులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నారు. గడ్డం సాయితో చర్చించిన అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఆందోళనకారులతో మాట్లాడుతూ... గడ్డం సాయి వద్ద పనిచేస్తున్న కార్మికులకు రుణమాఫీ చేయలేమన్నారు. కార్మికులకు అవసరమైతే యజమానికి బాకీ ఉన్న వడ్డీను తగ్గిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అందించేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొనడంతో కార్మికులు ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇదే విషయంపై మహిళా కార్మికులు ఎమ్మెల్యేతో గొడవకు దిగారు.

మాదవ నాగరాజు నిర్వహిస్తున్న మగ్గాలకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎలా చేస్తామని ప్రశ్నించారు. వారందరూ రుణ విముక్తికి అర్హులైనప్పుడు మేమేందుకు అవమని ప్రశ్నించారు. ఈ విషయంపై తడబడిన ఎమ్మెల్యే గతంలో ఎన్నికలప్పుడు తనకు సహకరించలేదని పేర్కొనడం కొసమెరుపు. మాదవ నాగరాజు విషయంలో జరిగినట్లుగానే మాకు కూడా విముక్తి కల్పించి తీరాలన్నారు. ఈ వాదులాట చోటు చేసుకుంటున్న తరుణంలో మహిళలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయ్... నోర్మూసుకుని కూర్చో..!! రౌడీయిజం చేస్తున్నారా..? అంటూ మాట్లాడడం విశేషం.

మరిన్ని వార్తలు