ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపు నేడు

25 Mar, 2015 02:01 IST|Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు-కృష్ణా జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నిక ఫలితం బుధవారం తేలనుంది. గుంటూరులోని సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రం వేదికగా గెలుపెవరిదో తేలనుంది. ఈనెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక గెలుపోటములపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఎన్నికలో రెండు జిల్లాల పరిధిలో ఉన్న మొత్తం 18,931 ఓట్లలో 13,046 ఓట్లు పోలయ్యాయి. గుంటూరులో 6,672, కృష్ణా జిల్లాలో 6,374 ఓట్లు ఉన్నాయి. రెండు జిల్లాల్లోని 110 పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లన్నింటినీ ఒక డబ్బాలో పోసి అభ్యర్థుల వారీగా విభజించి లెక్కిస్తారు.

ప్రథమ ప్రాధాన్యత ఓటుతో పాటు రెండో ప్రాధాన్యత ఓటును వేర్వేరుగా లెక్కిస్తారు. ఇందుకు సెయింట్ జోసఫ్ కళాశాలలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిగినందున ఓట్ల లెక్కింపు, తుది ఫలితం ప్రకటించేందుకు అధికం సమయం పట్టే అవకాశముంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పోలీసుశాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. లెక్కింపు కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు పరుస్తున్నట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఫలితాల కోసం అభ్యర్థులు, మద్దతుదారులు ఎదురుచూస్తున్న తరుణంలో మరి కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది.
 
ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోండి  -భన్వర్‌లాల్
గుంటూరు ఈస్ట్: కృష్ణా-గుంటూరు జిల్లాల శాసనమండలి ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంగళవారం హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఓట్ల లెక్కింపు నిర్వహించాలన్నారు. 25న ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ  ప్రారంభించాలన్నారు.  

లెక్కింపు హాలులో సీసీ టీవీ,కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గుర్తింపు కార్డు కలిగిన వారిని మినహా ఇతరులను కేంద్రంలోనికి ,లెక్కింపు హాలులోనికి అనుమతించవద్దని ఆయన స్పష్టం చేశారు. పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపు ప్రక్రియలో ఏ సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. లెక్కింపు ముగిసిన వెంటనే అభ్యర్థులకు పోలైన ఓట్ల  వివరాలను ఎన్నికల ఏజెంట్లకు తెలియజేయాలన్నారు. ఎన్నికల సంఘం పరిశీలన అనంతరం అభ్యర్థి ఎంపిక  ప్రకటనను తెలియజేస్తుందని, అనంతరం రిటర్నింగ్ అధికారి ప్రకటించవచ్చని చెప్పారు.           

మరిన్ని వార్తలు