ఎమ్మెల్సీలకు పదవీ గండం

30 Aug, 2013 02:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముగ్గురు ఎమ్మెల్సీలు తమ పదవులు కోల్పోనున్నారు. అదెలా అంటారా... ఏ రాష్ట్రంలోనైనా ఎమ్మెల్యేల సంఖ్య120 మంది కంటే తక్కువ ఉంటే.. అక్కడ శాసనమండలిని కొనసాగించే అవకాశం లేదని రాజ్యాంగం, రాజ్యాంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టం ఏర్పడితే పది జిల్లాల్లో 119 మంది శాసనసభ్యులు ఉన్నందున తక్షణమే ‘మండలి’ రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్సీలు బి.వెంకట్రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, కె.స్వామిగౌడ్ తమ పదవులు కోల్పోయే అవకాశం ఉంది. పది జిల్లాలతో కూడిన రాష్ట్రంలో 121కి పైగా ఎమ్మెల్యేలుంటే.. పార్లమెంట్ ఆమోదంతో శాసనమండలిని తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంది. దీనికి జిల్లాలు, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితేనే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా వెంటనే జరిగేది కాదు.
 
  ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర విభజనతో తక్షణమే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇదే జరిగితే  కాంగ్రెస్ అనుబంధ సింగరేణి ట్రేడ్ యూనియన్ ఐఎన్‌టీయూసీ నుంచి ఎదిగిన బి.వెంకట్రావు, తెలంగాణ ఉద్యమాల ద్వారా ఉపాధ్యాయులు, పట్టభద్రులకు చేరువైన స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డిలు ఇప్పటి వరకు పరోక్ష రాజకీయాల్లో ఉన్న వారే. అయితే రాష్ట్ర విభజన అనంతరం శాసనమండలి రద్దయి, ఆ తర్వాత శాసనసభకు ఎన్నికలు జరిగితే ఆ ముగ్గురు పదవులకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో స్వామిగౌడ్‌తోపాటు పాతూరి సుధాకర్‌రెడ్డి, బి.వెంకట్రావులు తిరిగి రాజకీయ భవిష్యత్తును కోరుకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవడం తప్పనిసరని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం జరిగే ఈ పరిణామాలు రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది.
 
 ఎమ్మెల్సీల భవిష్యత్తుపై రాజకీయ విశ్లేషకుల్లో చర్చ
 స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పదవీ కాలం ఈ ఏడాది మే మాసంలో ముగిసింది. అప్పటికీ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల జరగని కారణంగా ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా సంక్రమించే పదవులకు దూరంగా ఉన్నారు. అయితే కలిసొస్తే మంచిర్యాల, సిర్పూరు(టి) నియోజక వర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాకు ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్సీల పరిస్థితి ఏమిటనేదే తాజా రాజకీయాంశం. ఐఎన్‌టీయూసీ నేతగా ఉన్న బి.వెంకట్రావుకు సింగరేణి ఉద్యమాలే ఆయన బ్యాక్ గ్రౌండ్. అయితే శాసనమండలి రద్దయి పదవులను కోరుకుంటే ప్రత్యామ్నాయంగా ఏ అసెంబ్లీ వెతుక్కోవాలన్నది చర్చనీయాంశమే. ఇదిలా వుంటే నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న పాతూరి సుధాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిగా గెలుపొందారు.
 
  రాజకీయపార్టీ బలపర్చినా ఉపాధ్యాయులు ఆయనను ఆదరించి అండగా నిలిచారు. తిరిగి ఆయన రాజకీయాల్లోనే ఉండాలనుకుంటే ఏదేని శాసనసభ స్థానంను ఎంచుకోవాల్సిందే. అలాగే పట్టభద్రుల అభ్యర్థిగా గెలుపొంది నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కె.స్వామిగౌడ్ తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల నేతగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. రాష్ర్ట విభజన అనంతరం ‘మండలి’ రద్దయి ప్రత్యక్ష రాజకీయాలకు చేరువవ్వాలంటే ఆయన కూడ ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే.

మరిన్ని వార్తలు