సా...గుతున్న ‘తెలంగాణ’.. రగులుతున్న సీమాంధ్ర | Sakshi
Sakshi News home page

సా...గుతున్న ‘తెలంగాణ’.. రగులుతున్న సీమాంధ్ర

Published Fri, Aug 30 2013 2:51 AM

Seemandhra region boiling since congress anouncement

రాష్ట్ర విభజనపై నిర్ణయం ప్రకటించి నేటికి నెల
 సాక్షి, హైదరాబాద్:  రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  నిర్ణయం ప్రకటించి నేటికి సరిగ్గా నెల రోజులు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అలాగే, విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో  మొదలైన ఉద్యమం కూడా ఒక్క అడుగు వెనక్కితగ్గడంలేదు. రాజధాని హైదరాబాద్‌లో పోటాపోటీ ఆందోళనలు, సీమాంధ్రలో సకలజనుల సమ్మెతో రాష్ట్ర అగ్నిగుండంలా మారుతున్నా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఇంకా నోరుమెదపడం లేదు. ఎన్నికల వరకు విభజన అంశాన్ని నెట్టుకురావాలన్నదే కాంగ్రెస్ పెద్దల ఎత్తుగడగా కనిపిస్తోందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
 
 డిసెంబర్9 ప్రకటన నుంచి వివాదాస్పదమే...
 తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తీరు మొదటి నుంచి వివాదాస్పదమే. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెంటనే సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. తదనంతరం రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలు చెలరేగడంతో కేంద్రం డిసెంబర్ 23న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. తరువాత 2010 జనవరిలో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించింది.
 
  ఏడాదిపాటు రాష్ట్రంలో పర్యటించి అందరి అభిప్రాయాలను సేకరించిన ఈ కమిటీ  2010 డిసెంబర్ ఆఖర్లో కేంద్రానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో ఆరు పరిష్కార మార్గాలను సూచించిన కమిటీ రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడమే అత్యుత్తమ మార్గమని అభిప్రాయపడింది. ఆ తరువాత 2011 జనవరిలో చిదంబరం మళ్లీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అన్ని పార్టీలు అభిప్రాయాలను పంపాలని కోరారు. నాటి నుంచి మళ్లీ విభజన అంశాన్ని నాన్చుతూ రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ 2012 వరకు విభజన ఊసే ఎత్తలేదు.
 
 ఉపఎన్నికల్లో పరాభవం....విభజనపై నిర్ణయం!
 రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినడం హైకమాండ్ పెద్దలు తెలంగాణ అంశంపై పునరాలోచనలో పడేలా చేసింది. అందుకే డిసెంబర్ 28న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విభజనపై ఇదే ఆఖరు సమావేశమని, నిర్ణయమే తరువాయి అని ప్రకటించింది. ఈ ప్రకటన అనంతరం రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కట్టడం, విభజనపై ఎవరి వాదన వారు విన్పిస్తూ ఒత్తిడి తేవడంతో మళ్లీ ఏం చేయాలో బోధపడని హైకమాండ్ మరో ఆరు నెలల వరకు తెలంగాణ ఊసే ఎత్తలేదు. ఈ మధ్యకాలంలో సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ చేతిలో కాంగ్రెస్‌కు పరాభవం ఎదురు కావడంతో సీమాంధ్రలో ఏం చేసినా పార్టీ బాగుపడే అవకాశాల్లేవని కాంగ్రెస్ అధిష్టానం నిర్ధారణకు వచ్చింది.
 
  దీంతో విభజన దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. అందులో భాగంగానే గతనెల 12న కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సీఎం కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను పిలిపించి విభజనపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఆ తరువాత జూలై 26న మళ్లీ వాళ్లను ఢిల్లీకి పిలిపించి విభజన సమాచారాన్ని ఇవ్వడంతోపాటు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామనే పత్రాలపై ముగ్గురు నేతల సంతకాలను తీసుకుంది. ఆ తరువాత జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనకు అనుకూలంగా తీర్మానం చేసింది. అదేరోజు యూపీఏ భాగస్వామ్యపక్షాలను సమావేశపరిచి విభజనపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
 
 దీంతో తెలంగాణ ప్రక్రియ ఇక ఆగదని, పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందే అవకాశాలున్నాయని భావించిన తరుణంలో సీమాంధ్రలో ఒక్కసారిగా తీవ్ర ఆందోళనలు మొదల య్యాయి. అదే సమయంలో తెలంగాణ నుంచీ విభజన ప్రక్రియను వేగవంతం చేయాలనే ఒత్తిళ్లు హైకమాండ్‌కు తాకుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట మేరకు ముందుకు పోవడమా? లేక వెనక్కు తగ్గడమా? అనే విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్న కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ సమస్యను నాన్చివేసే దిశగా ఆంటోనీ కమిటీ ఏర్పాటు చేసింది. ఇలా  2009 డిసెంబర్ 9 మొదలు ఇప్పటి ఏకే ఆంటోనీ కమిటీ వరకు మొత్తం మూడున్నరేళ్ల ఎనిమిది నెలలుగా విభజనపై తప్పటడుగులు వేస్తూ  కాంగ్రెస్ హైకమాండ్ తన మార్క్ రాజకీయాలతో రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చి, ప్రజలను దిక్కుతోచని స్థితిలో పడేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement