ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా

8 Jan, 2015 00:48 IST|Sakshi
ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తా

 కోటగుమ్మం, (రాజమండ్రి) : ‘ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన వాడిని, ఆ వ్యవస్థపై అవగాహన ఉన్న అధికారిని, తనను టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తాను’ అని మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో తాను అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ పరంగా ఈ ఎన్నికలు ఉండవని, పార్టీలు అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయాలని, ఎవరైనా స్వతంత్రంగా పోటీ చేయాల్సిందేనన్నారు. వైఎస్సార్ సీపీ మద్దతు తనకు ఉందని పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొవ్వలి గ్రామం తన స్వగ్రామమని, ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాలలో డిగ్రీ, జబల్‌పూర్‌లో ఎంఏ, ఉస్మానియ యూనివర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశానన్నారు. గ్రూప్-1 ఉద్యోగం లభించడంతో పంచాయతీ అధికారిగా పనిచేశానన్నారు.
 
 తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సీఈఓగా ఎక్కువ సమయం పనిచేశానన్నారు. పంచాయితీ రాజ్ కమిషనర్ గా చేస్తున్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు. పాయకరావు పేట ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. 2014 ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేశానన్నారు. జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న సమయంలో ఉపాధ్యాయుల నియామకం పారదర్శకంగా నిర్వహించానన్నారు. 20 వేల మందికి ఒకేసారి నియామక ఉత్తర్వులు ఇప్పించిన ఘనత తనదేనని పేర్కొన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే పీఆర్‌సీ ఫిట్‌మెంట్‌పై విజయం సాధిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు