టీడీపీ భూస్థాపితం ఖాయం

4 Apr, 2019 08:14 IST|Sakshi
తణుకు రోడ్‌షోలో మాట్లాడుతున్న మోహన్‌బాబు

సాక్షి, తణుకు : కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీఆర్‌ చావుకు కారణమై ఆయన నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కుని ఇప్పుడు నాదే పార్టీ అంటున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఎన్టీఆర్‌ శాపం తప్పకుండా ఫలిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు పట్టణంలో రోడ్‌షో నిర్వహించిన మోహన్‌బాబు స్థానిక నరేంద్రసెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

ఎన్నికల సమయంలోనే డ్వాక్రా మహిళలు చంద్రబాబుకు గుర్తుకు వస్తారని ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో వాళ్ల సొమ్ములు వాళ్లకే ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు మట్టి, ఇసుక దోచేసి రూ.లక్షల కోట్లు ఆర్జించి ఇప్పుడు మరోసారి ఓటేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నాడని అన్నారు. ఈసారి చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం ప్రజల రక్తాన్ని సైతం దోచేస్తాడని విమర్శించారు. కనీసం సరిగా మాట్లాడడం రాని తన కొడుకు లోకేష్‌కు మూడు మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం జగన్‌ వెంటే ఉందని రాబోయే ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు. 


హైదరాబాద్‌ నుంచి పారిపోయిందెవరు?
జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు ఉన్నాయంటూ యాగీ చేస్తున్న చంద్రబాబుపై 11 కేసులు లేవా అని మోహన్‌బాబు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్‌ నుంచి అర్థరాత్రి పారిపోయి వచ్చింది నువ్వు కాదా అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. గత పదేళ్లుగా జగన్‌ ఒక్కడే పోరాడుతున్నాడని చంద్రబాబు మాత్రం ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలను వెంట బెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే చంద్రబాబు అయిదేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు.

ప్రత్యేక హోదాపై ఎన్ని నాలుకలతో మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలవరం నిధులకు సంబంధించి లెక్కలు అడిగితే చెప్పలేని చంద్రబాబు అబ్బ మొగుడు సొమ్ములు అనుకుంటున్నాడా అంటూ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని వేరే దేశంలో అయితే ఉరి తీసేవారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో వైఎస్‌కు రాష్ట్ర ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని మోహన్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు వెంట ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నాయకులు పాతపాటి సర్రాజు, గుబ్బల తమ్మయ్య, ఎస్‌ఎస్‌.రెడ్డి, బలగం సీతారామం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు