వానర ప్రీతి.. సంభావన చేసి..

18 Nov, 2017 05:59 IST|Sakshi

ఇది వానర కార్తీక వనసమారాధన

వందలాదిగా వచ్చిన కోతులు 

పండ్లు, తినుబండారాలు అందజేత

 జి.కొత్తపల్లి వద్ద ఓ భక్తుని దాతృత్వం

ద్వారకాతిరుమల : కార్తీక మాసంలో వన భోజనాలు చేస్తే పుణ్యఫలాలు దక్కుతాయని భక్తుల విశ్వాసం. ఇది మనందరికీ తెలిసిందే. మనమంతా ఒకచోట చేరి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతాం. ఇదీ సాధారణమే. అయితే వనాల్లో తిరిగే మూగజీవాలైన వానరాల (కోతులు) కోసమే కార్తీక వన సమారాధన చేస్తే..? ఈ ఆలోచనే వచ్చింది జంగారెడ్డిగూడేనికి చెందిన ఎ.శ్రీరంగరాజ అనే వ్యక్తికి. వెంటనే ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఈ వానర కార్తీక వన సమారాధన ద్వారకాతిరుమల మండలంలోని జి.కొత్తపల్లిలో కార్తీక మాస చివరిరోజైన శుక్రవారం జరిగింది. వనాల్లోంచి వందలాదిగా రహదారిపైకి వచ్చిన వానరాలకు ఫలాలు, తినుబండారాలను అందించి ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

 మూగజీవాలు బతకాలని.. జంగారెడ్డిగూడెంకు చెందిన వ్యాపారి శ్రీరంగరాజ ఆంజనేయ స్వామి భక్తుడు. వానరాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. అడవులు నశించిపోతుండటం వల్ల మూగజీవాలన్నీ రోడ్డున పడుతున్నాయి. సరైన ఆహారం దొరక్క అలమటిస్తున్నాయి. దీన్ని చూసి ఆవేదనకు గురైన శ్రీరంగరాజ ఒక్కరోజైనా వాటికి కడుపునిండా ఆహారాన్ని అందించాలనుకున్నారు. ప్రస్తుతం కార్తీక వన సమారాధనలతో అన్ని కుల, మత వర్గాల వారు హడావుడిగా ఉన్నారు. వీటిని చూసింది తడవు ఆయన ఇలా జి.కొత్తపల్లిలోని అటవీ ప్రాంతం వద్ద వానర కార్తీక వస నమారాధనను జరిపారు. దాతకు జంగారెడ్డిగూడెంకు చెందిన కుక్కునూరి కృష్ణకుమార్, కోడూరి ఆంజనేయశర్మలు సహకరించి, వానరాలకు తినుబండారాలను అందించారు. 

ఆహారం పెడుతున్నారని తెలిసి.. 
తినుబండారాలను తీసుకొచ్చిన దాత ముందుగా కారు వద్ద ఆంజనేయుని చిత్రపటానికి పూజలు నిర్వహించారు. తరువాత పండ్లు, తినుబండారాలను వానరాలకు అందించడాన్ని మొదలు పెట్టారు. దీన్ని గ్రహించిన వానరాలు రోడ్డుపైకి పరుగులు తీస్తూ వచ్చాయి. మొదట నాలుగైదు వచ్చినా తరువాత వాటి సంఖ్య వంద వరకు వెళ్లింది. అవన్నీ పండ్లను అందుకున్నాయి. రోడ్డు వెంబడి మూడు నాలుగు ప్రాంతాల్లో ఈ తినుబండారాలను అందించారు. రహదారిపై వెళుతున్న ఆ కారు హారన్‌ విన్న వానరాలు.. పరుగు పరుగున కారు దగ్గరకు వచ్చి, వారందించిన పదార్థాలను ఒకదాని తరువాత మరొకటి అందుకున్నాయి. వాటిని ఆరగించిన తరువాత అడవిలోకి పరుగులు తీశాయి. 

ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి
చాలా మంది మూగజీవాలను పట్టించుకోరు. మానవ మనుగడకు అవి ఎంతగానో దోహద పడతాయి. ముఖ్యంగా జంతువులకు సేవ చేస్తే నేరుగా ఆ భగవంతుడికి సేవ చేసినట్లే. నానాటికీ అడవులు నశించి పోతున్నాయి. ఉన్న కొద్ది పాటి అటవీ ప్రాంతాలను ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు ఇస్తోంది. దీని వల్ల మూగజీవాల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అటవీశాఖ అధికారులు దీన్ని గ్రహించాలి. మూగజీవాలకు ఆహారాన్ని అందించేందుకు ఎవరికి వారు ముందుకు రావాలి. అదే నా ఆశయం.  
– ఎ.శ్రీరంగరాజ, జంగారెడ్డిగూడెం, దాత

వానరాలకు సేవ చేయడం ఆనందం 
మూగజీవాలైన వానరాలకు ఇలా ఆహార పదార్థాలు అందించడం నాకెంతో ఆనందంగా ఉంది. కార్తీక మాసంలో ఇలా వీటికి సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో ఆకలితో అవి పరుగు పరుగున వచ్చి తినుబండారాలను అందుకున్నాయి. 
– కుక్కునూరి కృష్ణకుమార్, జంగారెడ్డిగూడెం

నరుడా నీ ఉనికి తెలుసుకో
మనం వానర జాతి నుంచి ఉద్భవించి, నరుడిగా జ్ఞానోదయం పొంది, సమాజంలో జీవిస్తున్నాం. కానీ చాలా మంది వానరాలపై ప్రేమ చూపకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వానరులు వనాధిపతులు. అవి తల్లిదండ్రులతో సమానం. వాటిని మనం రక్షించుకోవాలి. వాటికి ఆహారాన్ని అందించే మంచి కార్యక్రమాన్ని తలపెట్టాం. ప్రతి ఒక్కరూ మూగజీవాలపై ప్రేమ చూపి, వాటికి ఆహారాన్ని అందించాలి. 
– కోడూరి ఆంజనేయ శర్మ, జంగారెడ్డిగూడెం

మరిన్ని వార్తలు