ఆంధ్రప్రదేశ్‌లోనే కేజీబీవీలు అధికం

25 Dec, 2013 02:09 IST|Sakshi

అర్వపల్లి, న్యూస్‌లైన్: అన్ని రాష్ట్రాల్లో కన్న ఆంధ్రప్రదేశ్‌లోనే కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్వీఎం రాష్ట్ర కమ్యూనిటీ మొబలైజేషన్ అధికారి (సీఎంఓ) డాక్టర్ బండి సాయన్న చెప్పారు. అర్వపల్లి కేజీబీవీని మంగళవారం  తనిఖీ చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 743 కేజీబీవీలు పని చేస్తున్నాయని తెలిపారు. బాలికలకు కేజీబీవీలలో ఉన్న వసతులు మరే వసతి గృహాల్లో ఉండవన్నారు. ఆర్వీఎం ఎక్కడా రాజీ పడకుండా కేజీబీవీలకు సౌకర్యా లు కల్పిస్తుందని చెప్పారు. అన్ని కేజీబీవీలకు పూర్తి కాలపు ఎస్‌ఓలను నియమించామన్నారు.

ఇక నుంచి కేజీబీవీల్లో ప్రతి ఆదివారం మాంసాహార భోజనం అందించనున్నట్లు తెలిపారు. ఆర్వీఎం ఎస్‌పీడీ ఉషారాణి కేజీబీవీల అభివృద్ధికి అనేక చర్యలు చేపడుతుందన్నారు. ప్రతి రోజు భోజనంలో కోడిగుడ్లు పెట్టాలని ఎస్‌ఓలను ఆదేశించారు. కేజీబీవీలకు బెడ్‌షీట్లు 15 రోజుల్లో రానున్నాయని తెలిపారు. కొత్తగా నిర్మించిన కేజీబీవీ భవనాలలో ఎక్కడైనా సమస్యలు ఉంటె వెంటనే గుత్తేదార్లతో మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. ఏ సమస్యలు ఉన్నా ఇక నుంచి బాలికలు 1800425, 3525 టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో   సీఎంఓ లింగయ్య, ఎమ్మార్జీ పగిళ్ల సైదులు, విజయలక్ష్మి, పాల్గొన్నారు.
 కస్తూరిబా పాఠశాల తనిఖీ
 తుంగతుర్తి :  మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆర్వీఎం అధికారి డాక్టర్ బండి సాయన్న మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాల అద్దె భవనంలో కొనసాగుతుడడంతో విద్యార్థులకు సరైనా బాత్‌రూంలు, టాయిలెట్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదన్నారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కస్తూరిబా పాఠశాలను పరిశీలించారు. పాఠశాల భవనాన్ని త్వరగా పూర్తి చేసి జనవరి 1వ తేదీ వరకు ప్రారంభించాలని, లేని పక్షంలో సంబంధిత  కాంట్రాక్టర్‌పై చర్య తీసుకుంటామని హెచ్చరించారు.      ఆయన వెంట కో ఆర్డినేటర్ జి. లింగయ్య తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు