కన్నీరు మున్నీరు

1 Apr, 2016 01:51 IST|Sakshi
కన్నీరు మున్నీరు

►పదివేలకు పైగా పింఛన్లకు కోత
జీవనాధారంకోల్పోతున్న నిరుపేదలు
► అంతా జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే..

 
పెన్షన్ ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాగేసుకుంటున్నారు. నోటికాడ కూడు లేకుండా చేస్తున్నారు. ఆధార్ డబుల్ ఎంట్రీఅని..ఆధార్ నంబర్ అప్‌లోడ్ కాలేదని.. వేలిముద్రలు పడడంలేదని ఇలా కారణాలేవైనా సరే ప్రతి నెలా 1500 నుంచి రెండువేల మంది పింఛన్లకు కోత పెడుతున్నారు. ఇలామూడునెలల పాటు కోత పడిన వారికి పూర్తిగా పింఛన్ మంజూరును నిలిపివేస్తున్నారు. ఎవరికి చెప్పు కోవాలో ఏం చేయాలో తెలియక అభాగ్యులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇలా ఐదు నెలల్లో జిల్లాలో 9,296 మందికి పింఛన్లు
 రద్దు చేశారు.

 
సాక్షి, విశాఖపట్నం: పట్టెడన్నం పెట్టే పింఛన్లకోసం నిరుపేదలు గతంలో ఎన్నడూ లేనంతగా పడరాని పాట్లు పడుతున్నారు. ఎప్పుడొస్తుందో తెలియదు. అసలు వస్తుందో రాదో తెలి యదు. ఒకటో తారీకు వచ్చిందంటే చాలు పింఛన్ చేతికొచ్చే వరకు వృద్ధులు.. వితంతు వులు..వికలాంగులు పడే పాట్లు వర్ణనాతీతం. టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు జిల్లాలో 3.28లక్షల పింఛన్లు ఉండేవి. ఆ తర్వాత జన్మభూమి కమిటీల పేరిట 25వేలకు పైగా పింఛన్లకు కోతపెట్టారు. ఆతర్వాత తొలగించినవాటిలో సుమారు 9వేల పింఛన్లను పునరుద్ధరించారు. గతేడాది అక్టోబర్‌లో 15వేల పింఛన్లను కొత్తగా మంజూరు చేశారు.

దీంతో అక్టోబర్‌లో పెన్షన్‌దారుల సంఖ్య 3,25,585కు చేరింది. వీరికి రూ.35.62 కోట్లు ప్రతీనెలా పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం ఒకే ఒక్క నెలలో మాత్రమే నూరు శాతం పింఛన్లు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి ప్రతీ నెలా రెండువేలకు తక్కువ కాకుండా కోత పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,15,289కి తగ్గిపోయింది. అంటే 10వేలకు పైగా పింఛన్లకు కోత  పడింది.

 ఐదు నెలలుగా కోతలే కోతలు
 జిల్లా వ్యాప్తంగా గడిచిన ఐదు నెలల్లో వరుసగా పింఛన్ల సంఖ్య నవంబర్‌లో 3,23,197, డిసెంబర్‌లో 3,17,348, జనవరిలో 3,17,170, ఫిబ్రవరిలో 3,16,404 చొప్పున తగ్గిపోగా..మార్చి కొచ్చే సరికి వాటి సంఖ్య 3,15,289కు పడిపోయింది. ఇలా ప్రతీ నెలలో 1500కు తక్కువ కాకుండా పింఛన్లకు కోతపడుతూనే ఉంది. మరో రెండు మూడు నెలలకొచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య 3 లక్షలకు తగ్గిపోతుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. వీటిలో సగానికి పైగా పింఛన్లు మూడు నెలల పాటు వరుసగా తీసుకోలేదనే సాకుతో జాబితాల   
 
నుంచే తొలగించేశారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది అక్టోబర్‌లో రూ.35.62కోట్లు పంపిణీ చేయగా మార్చిలో రూ.31.36కోట్లకు తగ్గిపోయింది. అంటే రూ.4.30కోట్ల మేర లబ్ధిదారులకు కోతపడింది. ప్రతీ నెలా 5వ తేదీకల్లా పంపిణీ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ ఏ నెలలోనూ 20వ తేదీలోపు పంపిణీ పూర్తి చేసిన దాఖలాలు కనిపించడం లేదు. మైదాన ప్రాంతాల్లోనే కాదు.. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో నెట్‌వర్క్ పని చేయక.. వేలి ముద్రలు పడక వృద్ధులు..వికలాంగులు ఒకటికి పదిసార్లు కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది.

 జన్మభూమి కమిటీలదే పెత్తనం..
 పంపిణీ అంతా జన్మభూమి కమిటీల కనుసన్నల్లోనే జరుగుతోంది. పేరుకు  కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది పంపిణీ చేస్తున్నప్పటికీ పెత్తనమంతా ఈ కమిటీలే చేస్తున్నారు.  కొన్ని చోట్ల గ్రామాల్లోకి వెళ్లలేక కార్యదర్శులు పంపిణీ బాధ్యతలను జన్మ భూమి కమిటీలకు అప్పగిస్తే వారు ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.వంద నుంచి రూ.200 వరకు కమీషన్ నొక్కేస్తున్నారు.ఆధార్ డబుల్ ఎంట్రీ, ఆధార్ మిస్‌మ్యాచ్ వల్లే కోతపడుతున్నదని అధికారులంటున్నారు. వేలిముద్రలు పడకపోయి నప్పటికీ కార్యదర్శలు, రెవెన్యూ సిబ్బంది వేలిముద్రలతో ఇచ్చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ విధంగా సుమారు 35వేలకు పైగా పింఛన్ల పంపిణీ జిల్లాలో జరుగుతుందని చెబుతున్నారు. జన్మభూమి మావూరుతో పాటు గ్రీవెన్స్‌లలో వచ్చిన ఫిర్యాదుల్లో కొత్త పింఛన్ల కోసం 3,41,826 వరకు దరఖాస్తులు ఉన్నాయి. గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలమాటెలాగున్నా జన్మభూమి, మావూరులో వచ్చిన వాటిల్లో  4ః1 నిష్పత్తిలో నాలుగు అర్జీలకు ఒక అర్జీని మాత్రమే అప్‌లోడ్ చేశారు. ఈ విధంగా గతేడాది 36,550 అర్జీలను మాత్రమే అప్‌లోడ్ చేశారు.

వయస్సు సరిపోలేదని, భూములు ఉన్నాయంటూ కుంటి సాకులతో 19,136 అర్జీలను తిరస్కరించారు. 17,414 మంది అర్హులని జన్మభూమి కమిటీలు లెక్కతేల్చగా 15వేల పింఛన్లు మంజూరు చేశారు. తాజాగా మరో 17వేల దరఖాస్తులను అప్‌లోడ్ చేశారు. ఓ పక్క కోతపెడుతూనే మరో పక్క ఇలా అరకొర పింఛన్లతో పూత రాస్తున్నారన్న వాదన ఉంది. ఒకసారి నిలిపివేసిన పింఛన్లను మళ్లీ పునరుద్ధరించడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమని అధికారులే సెలవిస్తున్నారు. దీంతో ప్రతీ నెలా సాంకేతిక కారణాలతో పింఛన్లు కోల్పోతున్న నిరుపేదలు కన్నీరుమున్నీరవుతున్నారు.

మరిన్ని వార్తలు