ఎంపీడీఓల బదిలీలు?

6 Feb, 2014 03:34 IST|Sakshi

నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో జిల్లాలోని 45మంది మండల పరిషత్ అభివృద్ధి (ఎంపీడీఓ) అధికారులకు స్థాన చలనం కలగనుంది. సొంత జిల్లాతోపాటు మూడు సంవత్సరాలకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న మండలస్థాయి అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వీరందరికీ స్థానం చలనం తప్పడం లేదు.
 
 జిల్లా నుంచి వేరే జిల్లాలకు బదిలీ కానున్నారు. ఈ నెల పదో తేదీ వరకు బదిలీలు చేయాలని ఆదేశించడంతో ప్రక్రియను పూర్తిచేసే పనిలో అధికార యంత్రాంగం తలమునలైంది. ఇప్పటికే సొంత జిల్లాకు చెందిన వారితోపాటు మూడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న అధికారుల జాబితాను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు జిల్లా పరిషత్ సీఈఓ వెంకట్రావు బుధవారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రెండు మూడు రోజుల్లో బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయని చెప్పారు.
 
 ఏవైనా మూడు జిల్లాలకు బదిలీ కోరుకునే అవకాశం
 ఎంపీడీఓలకు ఏవైనా మూడు జిల్లాలకు బదిలీని కోరుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు ఎంపీడీఓలు కోరుకున్న జిల్లాల పేర్ల జాబితాను కూడా నివేదించారు. జిల్లాలో మొత్తం 59 మండల పరిషత్‌లకు గాను పది మండల పరిషత్‌లకు ఇన్‌చార్జి ఎంపీడీఓలు కొనసాగుతుండగా, 49 మంది మాత్రమే పూర్తిస్థాయి మండల పరిషత్ అధికారులు ఉన్నారు. వీరిలో 33 మంది సొంత జిల్లాకు చెందిన వారు కాగా 12 మంది ఇతర జిల్లాలకు చెందినవారున్నారు. వీరందరూ మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్నారు. దీంతో మొత్తం 45 మంది ఎంపీడీఓలు ఇతర జిల్లాలకు బదిలీలు కానున్నారు. యాదగిరిగుట్ట, మేళ్లచెర్వు, రాజాపేట, మర్రిగూడ మండలాల్లో పనిచేస్తున్న వారు ఇతర జిల్లాల అధికారులైనప్పటికీ మూడేళ్లు పూర్తికాని కారణంగా బదిలీ కావడం లేదు.
 
 ఇన్‌చార్జ్‌లకు కూడా స్థానచలనం
 జిల్లాలోని పది మండల పరిషత్‌లకు ఈఓఆర్‌డీలు,  కార్యాలయ సూపరింటెండెంట్లు.. ఇన్‌చార్జి ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. నాంపల్లి, చింతపల్లి, చందంపేట, నిడమనూరు, గుండాల మండలాలకు ఈఓఆర్‌డీలు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అదే విధంగా అనుముల, చండూరు, నూతన్‌కల్, డిండి, పెన్‌పహడ్ మండల పరిషత్‌లకు కార్యాలయ సూపరింటెండెంట్లు ఇన్‌చార్జి ఎంపీడీఓలుగా వ్యవహరిస్తున్నారు. వీరందరూ మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలోని ఇతర మండలాలకు బదిలీ చేయనున్నారు. వీరు ఏంపీడీఓలుగా కాకుండా ఈఓఆర్‌డీ, కార్యాలయ సూపరింటెండెంట్‌లుగానే బదిలీ కానున్నారు. ఈ మండలాలకు ఇతర జిల్లాలనుంచి వచ్చే వారిని నియమించనున్నారు.
 

మరిన్ని వార్తలు