‘శ్రీమతి అమరావతి టైటిల్‌ను ఆమె అందజేస్తారు’

12 Oct, 2019 18:56 IST|Sakshi

సాక్షి, మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రముఖ మోడల్స్‌ అంజనా, అపర్ణ, మిసెస్‌ తెలంగాణ టైటిల్‌ విన్నర్‌ స్నేహా చౌదరి అన్నారు. మొగల్రాజపురంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం తేజాస్‌ ఎలైట్‌ ఈవెంట్స్‌ ఆధ్వర్యంలో మిసెస్‌ అమరావతి-2019 పేరుతో సంప్రదాయ ఫ్యాషన్‌ షో  ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. నగరంతో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి 60 మంది మహిళలు హాజరై సంప్రదాయ, టాలెంట్‌ రౌండ్స్‌లో ప్రతిభను ప్రదర్శించారు. ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేశారు. 

ఈ విషయం గురించి తేజాస్‌ ఎలైట్‌ ఈవెంట్స్‌ అధినేత, పోటీల నిర్వాహకుడు ప్రదీప్‌ చౌదరి మాట్లాడుతూ సంప్రదాయ ఫ్యాషన్‌ షోకు మహిళల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. మహిళల్లో దాగి ఉన్న ప్రతిభ పెళ్లి అయిన తర్వాత కొంతమందిలో పోతుందని చెప్పారు. చాలామంది తమ వృత్తికి, ఇంటికే పరిమితం అవడం వల్ల వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే అవకాశం లేకుండా పోతుందన్నారు. అలాంటి వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

అదే విధంగా ఈ నెల 20న ఇబ్రహీంపట్నంలో ఫైనల్స్‌ పోటీలు నిర్వహిస్తామని, ప్రతిభ చూపిన వారికి శ్రీమతి అమరావతి-2019 టైటిల్‌ను సినీ హీరోయిన్‌ ప్రేమ చేతుల మీదుగా అందజేస్తామన్నారు. ఆ రోజు జరిగే ఫైనల్స్‌ పోటీలకు జబర్దస్త్‌ టీమ్‌తో పాటు సినీ రంగానికి చెందిన పలువురు పాల్గొంటారని చెప్పారు. మిసెస్‌ అమరావతి టైటిల్‌ మాజీ విన్నర్స్‌  వర్షితా వినయ్‌ (2017), మంజులా (2018), పోటీల సహ నిర్వాహకులు సుమన్‌ బాబు, విష్ణు బొప్పన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు