అవినీతి చేప చిక్కింది !

19 Mar, 2015 02:38 IST|Sakshi

 పాలకొండ/పాలకొండ రూరల్ : పాలకొండ నగర పంచాయతీలో కొంతమంది అధికారుల అక్రమాలకు స్థానికులు చెక్ పెట్టారు. అధికారుల తీరుపై విసుగు చెంది ఉన్న బాధితులు అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు. వారు పన్నిన వలలో నగర పంచాయతీ కమిషనర్ టాటపూడి కనకరాజు బుధవారం చిక్కారు. ఇక్కడ ఏ పని చేయాలన్నా సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు ఇది రుజువైంది. తాజాగా కమిషనర్ స్థాయి అధికారే లంచం కోసం డిమాండ్ చేయడం.. ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంమైంది. బుధవారం జరిగిన ఏసీబీ దాడి వివరాలను సంబంధిత డీఎస్పీ రంగరాజు తెలిపారు. నగర పంచాయతీ పరిధి నాగవంశం వీధిలో నివాసముంటున్న పోలుబోతు రామారావు ఇంటి నిర్మాణం జరుపుతున్నారు. ప్లాన్ అనుమతి కోసం అతని అన్న గురునాథరావు ఈ నెల ఒకటో తేదీన పంచాయతీ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
 
  ప్లాన్ అనుమతికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు రూ.12,500 కాగా మరో రూ.12,500 అదనంగా చెల్లించాలని కమిషనర్ కనకరాజు డిమాండ్ చేశారు. దీంతో విసుగు చెందిన గురునాథరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వీరు సూచనల ప్రకారం బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో ఏసీబీ అధికారులు రంగు పూసిన నోట్లను గురునాథానికి ఇచ్చి కమిషనర్‌కు వాటిని అందించామన్నారు. ఏసీబీ సిబ్బంది సూచించినట్టే ఆ సొమ్మును కమిషనర్‌కు గురునాథరావు అందించారు. అయితే కమిషనర్ కనకరాజు ఆ మొత్తాన్ని అవుట్‌సోరింగ్ విధానంలో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ వినోద్‌కు అందించాలని కోరడంతో అలాగే చేశారు. అయితే అక్కడే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకోవడంతో కమిషనర్ గుట్టురట్టయింది. కాగా కమిషనర్ కనకరాజు పాడేరు డివిజన్లో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న సయమంలో కూడా ఏసీబీకి పట్టుపడటం గమనర్హాం. వీరి నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తామని ఏసీబీ డీఎస్పీ రంగరాజు విలేకరులకు తెలిపారు. ఏసీబీ సీఐలు జి.లక్ష్మణ్, రమేష్, సిబ్బంది దాడిలో పాల్గొన్నారు.
 
 తప్పించుకున్న మరో అధికారి !
 ఇంటి నిర్మాణ అనుమతుల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో అధికారిని కూడా ఏసీబీకి పట్టించాలని స్థానికులు పథకం వేశారు. బాధితుడు గురునాథరావు చెప్పిన వివరాల ప్రకారం.. కమిషనర్ కనకరాజుతోపాటు ఆ అధికారి కూడా డబ్బులు డిమాండ్ చేశారు. అయితే ఏసీబీ అధికారులు దాడి చేసిన సమయంలో ఆయన లేక పోవడంతో తప్పించుకున్నట్టయింది.
 
 సిబ్బందికి అలవాటుగా మారింది !
 నగర పంచాయతీలో ప్రతి పనికీ డబ్బులు వసూలు చేయడం సిబ్బందికి అలవాటుగా మారింది. పాలకవర్గం లేకుండా ఏడాదిపాటు పని చేసిన సిబ్బంది అన్నింటినీ పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా స్థాయి పెరిగినప్పటి నుంచి పన్నులు పెరుగుతాయన్న భయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న కమిషనర్ ఇష్టానుసారంగా ప్లాన్ల అనుమతి కోసం డబ్బులు వసూళ్లు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొత్త పాలకవర్గం ఏర్పడిన తరువాత పాలకవర్గం పలుమార్లు అధికారులు అవినీతిపై నిలదీసిన సందర్భాలు ఉన్నాయి.
 
 వరుసగా మూడో సంఘటన  
 పాలకొండ నగర పంచాయతీలో ఏసీబీ దాడులు జరగటం అనవాయితీగా మారింది. మేజర్ పంచాయతీగా ఉన్నప్పుడు 2011లో అప్పటి ఈవో మల్లేశ్వరరావు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. నగర పంచాయతీగా మారిన తరువాత మొదటి కమిషనర్ నాగభూషణరావు కూడా ఏసీబీ వలలో పడి సస్పెండ్ అయ్యారు. తాజాగా ప్రస్తుత కమిషనర్ కనకరాజు సైతం లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కారు.  
 
 లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వండి
 ఈ సందర్భంగా ఏసీబి డీఎస్పీ రంగరాజు మాట్లాడుతూ లంచం డిమాండ్ చేసే వారి సమాచారాన్ని తమకు తెలియజేయాలని కోరారు. 94404 46124 నంబరును సంప్రదించాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
 

మరిన్ని వార్తలు