ఆ ప్రకటన అవాస్తవం: చిరంజీవి

23 Dec, 2019 03:53 IST|Sakshi

శనివారం నాటి ప్రకటనకు నేను కట్టుబడి ఉన్నా..

అందుకు భిన్నంగా ఆదివారం వెలువడిన ప్రకటన ఫేక్‌

సినీనటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మూడు రాజధానులపై ప్రభుత్వం చేసిన ప్రకటనకు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఆదివారం పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. చిరంజీవి పేరుతో శనివారం నాటి ప్రకటనకు భిన్నంగా తెల్ల కాగితంపై ఆదివారం మరో ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దీనిని ఖండిస్తూ చిరంజీవి వాయిస్‌ మెసేజ్‌ను విడుదల చేశారు. తెల్ల కాగితంపై తన పేరిట వచ్చిన ప్రకటన అవాస్తవమని, ఫేక్‌ అని స్పష్టం చేశారు. ఆదివారం తెల్లకాగితంపై వచ్చిన ప్రెస్‌నోట్‌ తనది కాదని, అలాంటి ప్రకటన తానివ్వలేదని స్పష్టం చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా చేసిన ప్రకటనకే తాను కట్టుబడి ఉన్నానని, ఫేక్‌ ప్రకటనను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

చిరంజీవి శనివారం నాటి ప్రకటనలోని ముఖ్యాంశాలు
►అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.
►మూడు రాజధానులు.. అమరావతి – శాసన నిర్వాహక, విశాఖపట్నం – కార్యనిర్వాహక, కర్నూలు – న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం ఆహ్వానించాల్సిన, స్వాగతించాల్సిన సందర్భం ఇది.  
►ఇప్పటికే రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో రూ.లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది.
►రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉంది.
►శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులు చూసినా, జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివినా, తాజాగా జీఎన్‌ రావు కన్వీనర్‌గా ఉన్న నిపుణుల కమిటీ సిఫార్సులు చూసినా అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం అన్నది నిర్వివాదాంశంగా కనిపిస్తోంది.
►రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్థాలు నివారించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం ఉంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా