గుంటూరు స్థానిక కోటా నుంచి మండలికి నారాయణ?

18 Jun, 2014 02:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి.నారాయణను గుంటూరు స్థానిక సంస్థల కోటానుంచి శాసన మండలికి పోటీ చేయించాలని   ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి నారాయణ అసెంబ్లీ, శాసనమండలి రెండింటిలోనూ సభ్యుడిగా లేని విషయం తెలిసిందే. ఆరునెలల్లో ఆయన రెండు సభల్లో ఏదో ఒకదానికి సభ్యుడిగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. శాసనసభకు ఎన్నికయ్యేందుకు సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేవు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్‌రావు ప్రమాణం చేయకుండా మరణిం చడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. అయితే అది ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఆ వర్గం వారికే పోటీ అవకాశం ఉంటుంది. ఇక నారాయణను చట్టసభకు ఎన్నిక చేయాలంటే శాసనమండలి మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మండలిలో 50 స్థానాలు కేటాయింపైనా 42మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో స్థానిక సంస్థల కోటా స్థానాలు 6, నామినేటెడ్ కోటా 1, ఎమ్మెల్యే కోటా ఒక స్థానమూ ఉంది.
 
 నామినేటెడ్ కోటాకింద ఇప్పటికే కంతేటి సత్యనారాయణరాజు ఎన్నికై ఉన్నారు. ఇక ఎమ్మెల్యే కోటా స్థానం, ఆరు స్థానిక కోటా స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మునిసిపల్ ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడినందున ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఇందులో గుంటూరు స్థానం కూడా ఒకటి. పార్టీకి అక్కడ స్థానిక సంస్థల్లో మెజార్టీ సీట్లు వచ్చినందున మండలికి నారాయణ ఎన్నిక సులువు అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల తర్వాత స్పష్టత వస్తుందని పార్టీ ముఖ్యనేత ఒకరు వివరించారు.

మరిన్ని వార్తలు