రైతులతో ట్రాన్స్‌కో‘మిత్రభేదం’ | Sakshi
Sakshi News home page

రైతులతో ట్రాన్స్‌కో‘మిత్రభేదం’

Published Wed, Jun 18 2014 2:40 AM

రైతులతో ట్రాన్స్‌కో‘మిత్రభేదం’ - Sakshi

నిజామాబాద్ నాగారం : కరెంటోళ్లు కర్షకులతో కటీఫ్ చేసినట్లున్నారు. ఈ మధ్య రైతులతో మిత్రబేధం పాటిస్తున్నారు. ఒక్క ఫోన్‌కాల్ చేస్తే చాలు.. 24గంటల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లను మరమ్మతులు చేసి ఇస్తామంటూ ‘రైతుమిత్ర’ పేరిట ట్రాన్స్‌కో ప్రారంభించిన పథకం ఆగిపోయింది. రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కార్తికేయమిశ్రా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ఏడాదిలోపే రెండుసార్లు నిలిచింది. తాజాగా నెలరోజుల నుంచి అమలు కావడం లేదు.
 
ప్రతిష్టాత్మకంగా రైతుమిత్ర
రైతుల ఇబ్బందులు, కష్టాలు ప్రత్యక్షంగా చూసిన సీఎండి కార్తికేయమిశ్రా ప్రతిష్టాత్మకంగా రైతుమిత్ర పథకం ప్రారంభించారు. వరంగల్ రీజియన్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. రైతుల పంటపొలాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌ల మరమ్మతులు, నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు.. తదితర విషయాల్లో సమస్యలు తలెత్తితే ఒక్క ఫోన్‌కాల్‌తో 24గంటల్లో సమస్య పరిష్కరించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకాన్ని రైతులు బాగానే సద్వినియోగం చేసుకున్నారు.
 
ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయిన వెంటనే టోల్‌ఫ్రీ నంబర్- 9440811600కు ఫోన్ చేస్తే సరిపోయేది. జిల్లాలోని మారుమూల గ్రామంలో, అటవీ ప్రాంతంలో సాగుచేస్తున్న పంటపొలాల్లో నుంచి ఫోన్ చేసినా అధికార యంత్రాంగం అక్కడికి చేరుకోని సమస్యను తెలుసుకునేవారు. 24గంటల్లో రైతుల ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యను పరిష్కరించే వారు. ఈ పథకం పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి సీఏండీ ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకునేవారు.
 
నెలకు 700ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు
ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తులకు సంబంధించి జిల్లాలో ప్రతి నెలా సుమారు 700వరకు ట్రాన్స్‌ఫార్మర్ల మర్మతులు అయ్యేవి. వీటిపై సీఎండీ సీరియస్ ఉండడంతో అధికారులు బాగానే పని చేశారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోతే ఎప్పుడు బాగవుతుందో తెలియని పరిస్థితి. దాన్ని బాగు చేయాలంటే రైతులే స్వంత ఖర్చులతో దగ్గరలోని డివిజన్ కార్యాలయానికి తరలించేవారు. ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్ బాగు చేయాలంటే అధికారులు ముడుపులు సైతం తీసుకునేవారు.ఈక్రమంలో రైతుమిత్ర పథకం వారిపాలిట వరంలా మారింది. ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోతే అధికారులే వచ్చి..బాగుచేయించి మళ్లీ యథావిథిగా పెట్టేవారు. ఇందుకు సంబంధించి రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకునేవారు కాదు. రవాణా సైతం ఉచితంగానే చేసేవారు. నెలకు 700వరకు ట్రాన్స్‌ఫార్మర్లు చెడిపోయిన 24గంటల్లో బాగు చేసి రైతులకు కష్టం కలుగకుండా చూసేవారు.
 
రైతులకు మళ్లీ కష్టాలు
రైతుమిత్ర పథకం ఆగిపోవడంతో రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. జిల్లాలో మే నుంచి ఈ పథకాన్ని నిలిపివేశారు. గతంలో కూడా రెండు సార్లు నిలిపివేయడంతో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల్లో అధికారులు, సిబ్బంది మళ్లీ మాముళ్లకు అలవాటు పడటంతో అధికారులు పథకాన్ని పునఃప్రారంభించారు. ఇప్పు డు నెల గడుస్తోంది.. పథకం ఎందుకు ఆపివేశారో తెలియదు. దీంతో రైతులకు మళ్లీ పాతకష్టాలు మొదలయ్యాయి. వెంటనే రైతుమిత్ర ను ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
 
తీసుకురావడానికే రెండువేలు ఖర్చు
మాది మాక్లూర్ మండలం కల్లెడ. ఐదుగురు రైతులం కలిసి ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ను పొలంలో ఏర్పాటు చేసుకున్నాం. రెండు నెలల కిందట అది చెడిపోవడంతో రైతుమిత్ర ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా మరమ్మతులు చేసి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ చెడిపోయింది. రైతుమిత్ర పథకం లేదని చెప్పడంతో మేమే రూ. రెండువేలు రవాణా ఖర్చులు భరించి తీసువచ్చాం.  -గంగారెడ్డి, రైతు

Advertisement
Advertisement