ఆశలకు ‘నీళ్లు వదిలేశారు’!

3 Jul, 2017 04:31 IST|Sakshi
ఆశలకు ‘నీళ్లు వదిలేశారు’!

నారాయణపురం ఆనకట్ట నీటిని ఆపలేకపోతోంది. మరమ్మతులకు కావాల్సిన రూ.94 లక్షలు ఇవ్వలేని ప్రభుత్వ అసమర్థతకు తార్కాణంగా ఆనకట్ట తలుపులు నీటి ప్రవాహాన్ని అడ్డుకోలేక పడిపోతున్నాయి. ఆధునికీకరణ ఊసెత్తని నాయకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా దీని నీటి నిల్వ సామర్థ్యం ఏటా తగ్గిపోతోంది. ఖరీఫ్‌లో రైతులకు అండగా ఉండాల్సిన నీటి వనరు ఇప్పుడు వారికి ఆందోళన కలిగిస్తోంది. నారాయణపురం ఆనకట్టకు లీకులు ఏర్పడి నీరు వృథాగా పోతోంది. ఆదివారం కొన్నిచోట్ల మరమ్మతులు జరిగినా అవి సరిపోవని అన్నదాతలు అంటున్నారు.

రాజాంæ : జిల్లాలోని ప్రధాన నీటి వనరుల్లో ఒకటైన నారాయణపురం ఆనకట్ట పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఆధునికీకరణ లేకపోవడంతో పాత తలుపులు నీటి ప్రవాహాన్ని ఆపలేక ఆపసోపాలు పడుతున్నాయి. సంతకవిటి మండలంలోని రంగారాయపురం గ్రామం వద్ద 1960లో నిర్మించిన ఈ ఆనకట్ట ద్వారా 37వేల ఎకరాలకు సాగునీరు అం దుతుంది. ఖరీఫ్‌లో రైతులకు ఇదే జీవనాడి. ఇక్కడ నా గావళి నదిలో నీటి ప్రవాహం నిలకడగా ఉండదు. దీంతో కుడి, ఎడమ కాలువల ద్వారా ఒక్కో సారి సాగునీటిని ఆ యకట్టు ప్రాంతాలకు అందించలేని పరిస్థితి ఉంటుంది. కుడి, ఎడమ కాలువలను ఆధునికీకరించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. కానీ పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఆధునికీకరణ జరగడం లేదు. ఫలితంగా ఆనకట్ట వద్దకు వస్తున్న నీటిలో 90 శాతం మేర నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతోంది.

తలుపులే సమస్య
నారాయణపురం ఆనకట్టకు సంబంధించి మూడు అడుగుల ఎత్తులో సీసీ రాతికట్టు నిర్మాణం, ఆపై మూడు అడుగులు ఎత్తులో 118 తలుపులు ఉన్నాయి. ఈ తలుపులు ఇవతలి వైపు నుంచి అవతలి వైపు వరకూ 340 మీటర్లు పొడవున ఏర్పాటుచేశారు. గతంలో వీటికి రబ్బరు అమరికలు ఉండేవి. ప్రస్తుతం ఇవి లేకపోవడంతో తలుపులు వరద అధికమైన సమయంలో పడిపోతున్నాయి. ఫలితంగా> ఆరు అడుగుల ఎత్తులో 2400 క్యూసెక్కుల మేర ఉండాల్సిన నీటి సామర్థ్యం పడిపోయి ఆనకట్ట వద్దకు వస్తున్న నీరు మొత్తం నదిలోని దిగువ ప్రాంతాల్లోకి వెళ్లిపోతోంది.
ఇలా నీరు రావాలి...నారాయణపురం కుడి కాలువ ద్వారా సంతకవిటి మండలంతో పాటు పొందూరు, ఎచ్చెర్ల మండలాల్లోని పంట పొలాలకు సాగునీరు అందాల్సి ఉంది. మొత్తం 53 కిలో మీటర్ల మేర వ్యాపించిన ఈ కాలువ ద్వారా 18, 600 ఎకరాలుకు సాగునీరు అందాలి.

ఎడమ కాలువ ద్వారా బూర్జ, ఆమదాలవలస, శ్రీకాకుళం, గార మండలాల్లో 18,700 ఎకరాలు ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది. ఈ తలుపులు అర్ధంతరంగా పడిపోతుండడంతో కుడి, ఎడమ కాలువలకు 350 క్యూసెక్కులకు మించి నీరు అందడం లేదు. ఫలితంగా శివారు ప్రాంతాలకు సాగునీరు రావడం లేదు. శివారు ప్రాంతాల వరకూ సాగునీరు అందాలంటే కనీసం కాలువల్లో 460 క్యూసెక్కుల నీరు ప్రవహించాలి. కాలువల్లో అలా నీరు ప్రవహించాలంటే ఆనకట్ట వద్ద తలుపులను ఆనుకుని కనీసం 1500 క్యూసెక్కులు నీరు నిల్వ ఉండాలి.

ఏం చేయాలి?
ఆనకట్టకు సంబంధించి తలుపులు బాగుచేయాలి. ఒక త లుపు బాగు చేయాలంటే కనీసం రూ. 80 వేలు ఖర్చు అవుతుంది. 118 తలుపులు బాగుచేయాలంటే కనీసం రూ. 94 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఖర్చు చేసే పరిస్థితిలో అధికారులు ప్రస్తుతం లేరు. దీంతో ఆనకట్ట పరిస్థితి దయనీయంగా మారింది. అంతేకాకుండా గత రెండేళ్లుగా ఆనకట్ట తలుపుల నిర్వహణకు విడుదల కావాల్సిన రూ.70 వేలు ఇంకా విడుదల కాలేదు. దీంతో ఈ ఏడాది తలుపులు ఎత్తి దించే కార్యక్రమాన్ని కూడా చేయడంలేదు. గత ఏడాది జైకా బృందం కూడా ఈ ఆనకట్టను పరిశీలించి రూ. 80 కోట్ల నిధులకు ప్రతిపాదనలు తయారుచేసింది. ఈ నిధులు కూడా వస్తే ఆయకట్టు రైతులుకు సమస్యలు తప్పుతాయి.

మరిన్ని వార్తలు