దక్షిణాది రాష్ట్రాల్లో నీటికి కటకట 

22 Oct, 2023 05:21 IST|Sakshi

జలాశయాల్లో 48 శాతమే నీటి నిల్వలు 

గతేడాది ఇదే సమయానికి 92 శాతం నీటి నిల్వ

తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో కేవలం 25 శాతమే నీటి నిల్వ 

కేంద్ర జలసంఘం నివేదికలో వెల్లడి

సాక్షి, అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) వెల్లడించింది. నైరుతి రుతువపనాల ప్రభావం వల్ల కృష్ణా, కావేరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వల్ల జలాశయాల్లోకి నీటి నిల్వలు చేరలేదని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లోని జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 53.334 బీసీఎం (బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లు) కాగా..  25.361 బీసీఎం (48 శాతం) నిల్వలే ఉన్నాయని తెలిపింది. గతేడాది ఇదే రోజు నాటికి ఈ జలాశయాల్లో 92 శాతం నీరు నిల్వ ఉండేదని.. గత పదేళ్లలో సగటున ఆ ప్రాజెక్టుల్లో 74 శాతం నిల్వ ఉండేవని వెల్లడించింది.

గత పదేళ్లలో ఈ ఏడాదే జలాశయాల్లో కనిష్ట స్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 11.121 బీసీఎంలు కాగా.. ప్రస్తుతం కేవలం 2.815 బీసీఎంలు (25 శాతం) మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. గత ఏడాది ఇదే సమయానికి ఆ ప్రాజెక్టుల్లో 98 శాతం నీరు నిల్వ ఉండేదని.. గత పదేళ్లలో ఇదే రోజు నాటికి సగటున 76 శాతం నీరు నిల్వ ఉండేదని సీడబ్ల్యూసీ వెల్లడించింది.

నీటి నిల్వలు తక్కువగా ఉన్న నేపథ్యంలో సాగునీటికి దక్షిణాదిలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, పెన్నా బేసిన్‌లో తీవ్ర ఇబ్బందులు ఉంటాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 150 భారీ ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద ప్రవాహం, నీటి నిల్వలను సీడబ్ల్యూసీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. ఆ 150 ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై శుక్రవారం సీడబ్ల్యూసీ కేంద్రానికి నివేదిక ఇచ్చింది.  

నివేదికలోని ప్రధానాంశాలివీ 
సీడబ్ల్యూసీ పర్యవేక్షించే 150 జలాశయాల్లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 257.812 బీసీఎంలు. ఆ ప్రాజెక్టుల లైవ్‌ స్టోరేజ్‌ కెపాసిటీ 178.784 బీసీఎంలు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుల్లో 129.636 బీసీఎంలు(73 శాతం) నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ఆ ప్రాజెక్టుల్లో 140.280 బీసీఎంలు (81 శాతం) నీరు నిల్వ ఉండేది. గత పదేళ్లలో ఇదే సమయానికి సగటున 160.40 బీసీఎంలు (92 శాతం) నీరు నిల్వ ఉండేది.

దేశవ్యాప్తంగా చూసినా గత పదేళ్ల కంటే ఈ ఏడాది జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే మిగతా ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి లభ్యత మెరుగ్గానే ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లోని జలాశయాల్లో 89 శాతం, తూర్పు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో 77 శాతం, పశ్చిమ రాష్ట్రాల్లోని జలాశయాల్లో 88 శాతం, మధ్య భారత రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో 83 శాతం మేర నీటి నిల్వలు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు