కొసరు పనులు ఇంకెన్నాళ్లకు?

25 Aug, 2014 00:45 IST|Sakshi
కొసరు పనులు ఇంకెన్నాళ్లకు?

 అమలాపురం :జాతీయ రహదారి-216లో వైనతేయ గోదావరిపై బోడసకుర్రు - పాశర్లపూడిల మధ్య తలపెట్టిన వంతెన ఎనిమిదేళ్లయినా ఇంకా పూర్తి కాలేదు. మొన్నటి ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దుగ్ధతో అప్పటి అమలాపురం ఎంపీ జీవీ హర్షకుమార్ గత మార్చి 8నే వంతెనను ప్రారంభించేసినా.. అప్రోచ్‌రోడ్డు.. రెయిలింగ్ వంటి పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. పనులు పూర్తి కాకుండానే ‘ప్రారంభించేసిన’ సమయంలో నెల రోజుల్లో పనులు పూర్తి చేస్తామన్న జాతీయ రహదారి సంస్థ, కాంట్రాక్టు సంస్థ గామన్ అధికారుల మాట నీటిమూటే అయింది.
 
 రూ.70.50 కోట్ల అంచనా వ్యయంతో 2006లో ఈ వంతెన నిర్మాణం మొదలైంది. నిర్ణీత గడువు ప్రకారం 2010 ఏప్రిల్ 25 నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. వివాదాల కారణంగా పనులు తొలి నుంచీ మందకొడిగానే సాగాయి. ఈ ఏడాది మార్చి నాటికి వంతెన పనులు 90 శాతం పూర్తయ్యాయి. వంతెనపైరహదారి నిర్మాణం, ఇరువైపులా అప్రోచ్‌రోడ్డు, రైలింగ్ పనులు మాత్రమే అసంపూర్తిగా ఉండిపోయాయి. ఎన్నికల నిబంధనావళి అమలులోకి వచ్చినా, రాజకీయ ప్రయోజనం కోసం దాన్ని బేఖాతరు చేస్తూ అప్పటి ఎంపీ హర్షకుమార్ వంతెనను అనధికారికంగా ఆరంభించారు.
 
 అప్పటి  నుంచీ మోటార్ సైకిళ్లు, ఆటోలు, కార్లే కాక లారీల వంటి భారీ వాహనాలు కూడా వంతెన మీదుగా ప్రయాణిస్తున్నాయి. వంతెనపై రోడ్డు నిర్మాణం పూర్తయినా, అప్రోచ్‌రోడ్డు పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. పాశర్లపూడి వైపు రెయిలింగ్ పూర్తికాగా, బోడసకుర్రు వైపు పనులు ఇంకా మొదలు కాలేదు. అప్రోచ్‌రోడ్డు సైతం ఒక లేయర్ తారు మాత్రమే వేసి వదిలేశారు. అసంపూర్తి పనులను కేవలం వారం, పది రోజుల్లో పూర్తిచేసే అవకాశమున్నా, గత ఆరు నెలలుగా పూర్తి చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్రోచ్ పనుల సబ్ కాంట్రాక్టర్‌కు,  గామన్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలే జాప్యానికి కారణమని తెలుస్తోంది.
 
 ఆర్టీసీ బస్సులు నడిచేదెప్పుడు ?
 పనులు పూర్తి కాకున్నా.. వంతెనపై లారీల వంటి వాహనాల రాకపోకలు మొదలైనా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం బస్సులు నడపడం లేదు. ఈ వంతెన వల్ల అమలాపురం - తాటిపాకల మధ్య దూరం గణనీయంగా తగ్గుతుంది. జిల్లాలోని కత్తిపూడి - కృష్ణాజిల్లా పామర్రు మధ్య ఉన్న 216 జాతీయ రహదారికి ఈ వంతెన అనుసంధానంగా ఉంది. వంతెనపై బస్సుల రాకపోకలు మొదలైతే కాకినాడ, విశాఖపట్నం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, భీమవరం, ఆకివీడు, కృష్ణాజిల్లా కైకలూరు, పామర్రు, మచిలీపట్నానికి ఇది దగ్గర దారి అవుతుంది.
 
 అమలాపురం నుంచి రాజోలు దీవిలోని పలు గ్రామాలకు దగ్గర దారవుతుంది. ప్రసిద్ధి చెందిన అప్పనపల్లి బాలబాలాజీ ఆలయానికి అమలాపురం, ముమ్మిడివరం, అయినవిల్లి, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది భక్తులు వెళుతుంటారు. వీరు బస్సుల ద్వారా రాకపోకలు సాగించాలంటే అమలాపురం నుంచి తాటిపాక సెంటర్ చేరుకుని అక్కడ నుంచి బస్సు లేదా ఆటోల్లో అప్పనపల్లి వెళ్లాల్సి వస్తోంది. ఇది ఇబ్బంది కావడంతో చాలా మంది అమలాపురం నుంచి ఆటోల మీద అప్పనపల్లి చేరుకుంటున్నారు. అప్పనపల్లి పరిసర ప్రాంత వాసులు సైతం ప్రయాణాల కోసం ఆటోలపై ఆధారపడుతున్నారు.
 
 వంతెనపై బస్సుల రాకపోకలు ఆరంభమైతే అటు రాజోలు, ఇటు అమలాపురం డిపోలకు ఆదాయం పెరుగుతుంది. అయితే ఇప్పటి వరకూ సర్వీసులు ఎలా నడపాలనే దానిపై ఆర్టీసీ సర్వే కూడా చేపట్టకపోవడం గమనార్హం. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, జిల్లా, ఎన్‌హెచ్ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే వంతెన పనులు పూర్తి కాలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆరునెలల క్రితం ప్రారంభించేసిన వారధిని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు