ఓటేయాలంటే..వాగు దాటాలె

15 Nov, 2023 04:25 IST|Sakshi

గత జూలై వరదలకు కొట్టుకుపోయిన కొండాయి బ్రిడ్జి 

మరమ్మతులకు నోచుకోని వైనం 

వాగు దాటలేక తంటాలు... ప్రతీ పనికి అవస్థలే.. 

కొండాయి గ్రామ జనాభా 1860
ఓటర్లు:  1220    నివాస గృహాలు: 418
బతకడం వేరు. జీవించడం వేరు. వాళ్లు కేవలం బతుకుతున్నారంతే.. జీవించడాన్ని మన పాలకులు వాళ్లకింకా అలవాటు చేయలేదు. ప్రభుత్వాలు మారుతున్నా.. పాలకులూ మారుతున్నా.. ఆవిష్కరణలు ఆకాశాన్ని చుట్టేస్తున్నా.. ఇప్పటికీ ములుగు జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వాగులు దాటుతున్నారు. ఈ ఏడాది జూలై 27న వరద ఎనిమిది మందిని మింగింది. ఇప్పటికీ ఆ గ్రామాల్లో ఏ మనిషిని కదిలించినా రోదనలే. అంతుచిక్కని వేదనలే. వారిని ‘సాక్షి’ పలకరిస్తే వాగంత దుఃఖాన్ని వెళ్లబోసుకున్నారు. వారి ఎజెండా.. ఏమిటో చెప్పుకొచ్చారు. 

కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది 
మా అమ్మగారింటికి(కొండాయి) తొలుసూరు కాన్పు చేయించుకునేందుకు వచ్చిన. వాగుపై బ్రిడ్జి కూలింది. నొప్పులు రావడంతో వాగులో నుంచి నడుములోతుల్లో దాటుకుంటుపోయిన. దొడ్లకు చేరుకొని అక్కడి నుంచి ఏటూరునాగారం, ములుగు వెళ్లేసరికి బిడ్డ అడ్డం తిరిగింది. పెద్దాపరేషన్‌ చేసి డెలివరీ చేసిండ్లు. మళ్లీ బాలింత నొప్పులతో ఉంటే.. మా అమ్మనాన్న, వాళ్లు మరో పదిమంది కలిసి డొల్ల కట్టుకొని ఇంటికి తీసుకొచ్చారు.  – మానేటి సంధ్యారాణి, బాలింత, కొండాయి 

ఐదు నెలల నుంచి అంతులేని వ్యథ 
ఈ ఏడాది జూలై 27న అకాల వర్షాలకు ములుగు జిల్లా  ఏటూరునాగారం మండల పరిధి హైలెవెల్‌ బ్రిడ్జి కూలింది. జంపన్న వాగు ఉధృతికి కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలు అతలాకుతలమయ్యాయి. ఆయా గ్రామాల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి. కొండాయి గ్రామంలో వరద 8 మందిని జల సమాధి చేసింది. బ్రిడ్జి కొట్టుకుపోవడంతో కొండాయి, మల్యాల, గోవిందరాజుల కాలనీకి పూర్తిగా రాకపోకలు నిలిచాయి.

ఐదు నెలల నుంచి ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమయ్యారు. అనారోగ్య సమస్యలు తలెత్తితే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగులు దాటుతున్నారు. గర్భిణులు ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డొల్లాలు కట్టి వాగు దాటిస్తున్నారు. రేషన్‌ బియ్యం కోసం సైతం కొండాయిలో వేలి ముద్రవేసి.. వాగుదాటి దొడ్లకు వెళ్లి అక్కడి నుంచి బియ్యాన్ని మోసుకుంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. 

ఎరువు అందుతలేదు..  
పొలం పనుల కోసం కావాల్సిన ఎరువు బ­స్తా­లు, ఇతర సామగ్రిని తెచ్చుకునేందుకు నరకం కనిపిస్తోంది. ఎరువు బస్తాలను వాగు­లో నుంచి తలపై పెట్టుకొని దాటించడం కష్టంగా మారింది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇలా వ్యవసాయ పనిముట్లకు  కష్టాలు పడుతూ వాగుదాటాల్సి వస్తోంది.  –బొచ్చు ఉపేందర్, రైతు  

ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది 
ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాం. నా భర్త, కొడుకు  జంపన్నవాగు ప్రమాదంలో చచ్చి­పోయిండ్లు. ఇంటికి మగదిక్కులేకుండా పోయింది. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నా. నాకు ఏ అవసరం వచ్చినా.. ఆదుకునే వారే లేరు. బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న.  – మున్నిబేగం, కొండాయి 

ఒక్క కొండాయి గ్రామమే కాదు... ఏజెన్సీ పరిధిలోని అనేక ఆదివాసీ గూడేల ప్రజలు వంతెనలు లేక నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోల్లో, పోటీలో ఉన్న నేతల హామీల్లో వీరి సమస్యలు ఎక్కడా కనిపించవు. ఏజñ న్సీ వాసుల  ఇబ్బందులు ఇలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది బీడీ కార్మికులు  ఏళ్ల తరబడి సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. వీరి వెతలు నేతల చెవికెక్కుతాయన్న ఆశతో ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల వేళ...ఈ పీపుల్స్‌ ఎజెండాకు మోక్షం లభిస్తుందని వారు ఎదురుచూస్తున్నారు.

- అలువాల శ్రీనివాస్‌ 

మరిన్ని వార్తలు