టెట్‌ హాల్‌టికెట్ల జారీలో నిర్లక్ష్యం

15 Feb, 2018 13:02 IST|Sakshi
సాయి పద్మినికి వచ్చిన హాల్‌ టిక్కెట్‌, సాయి పద్మిని తల్లి జ్యోతి

కాలేజీ లేని చోట సెంటర్‌ కేటాయింపు

ఒంగోలు: టీచర్స్‌ ఎలిజబిలిటీ టెస్టు (టెట్‌) హాల్‌ టికెట్ల జారీలో నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దీని అనంతరం డీఎస్సీలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న విద్యార్థులకు ఈ వ్యవహారం పిడుగుపాటుగా మారింది. స్థానికంగా కొప్పోలు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ 6వ లైనులో నివాసం ఉంటున్న ఎస్‌.సాయి పద్మిని టెట్‌ పరీక్షకు దరఖాస్తుచేసుకోగా ఇటీవల హాల్‌ టికెట్‌ నంబర్‌ 1710714314404 జారీ అయింది. అయితే ఆమెకు పరీక్ష కేంద్రం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని చిలకలూరి పేట రోడ్డులో కేశనపల్లిలో ఉన్న కృష్ణచైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ను కేటాయించారు. దీంతో ఆ సెంటర్‌ను విచారించుకునేందుకు కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లారు. తీరా ఎంత విచారించినా ఆ పేరుతో ఎటువంటి పరీక్ష కేంద్రం అక్కడ లేదు. దీంతో తమ కుమార్తె ఎలా పరీక్ష రాయాలో ఎలో రాయాలో తెలియక  ఆందోళనతో బు«ధవారం రాత్రి మీడియాను ఆశ్రయించారు. పలువురు విద్యార్థులకు కూడా ఇలానే తప్పులు దొర్లాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతా ఆందోళన చెందుతున్నారు.

అధికారులు జోక్యం చేసుకోవాలి: విద్యార్థిని తల్లి జ్యోతి
టెట్‌ పరీక్ష రాయడం ద్వారా నాలుగేళ్లలోపు జరిగే టీచర్‌ పరీక్షలకు అర్హత ఉంటుంది. అయితే పరీక్ష కేంద్రం అడ్రెసే లేకపోతే పరీక్ష ఎలా రాయాలి? మేము ఇప్పటికే సెంటర్‌కోసం అనేక విధాలుగా తిరిగాం. కృష్ణ చైతన్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అనేది ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో మాత్రమే ఉంది. కానీ నరసరావుపేట , గుంటూరు జిల్లా అని హాల్‌టిక్కెట్‌లో ఇచ్చారు. తక్షణమే సెంటర్‌కు సంబంధించి స్పష్టత తెలియజేయాలి.

మరిన్ని వార్తలు