లోకేశ్‌తో నెటిజన్ల హోలీ ఆట

21 Mar, 2019 11:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేశ్‌ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోళీ రోజు రసాయన రంగులు హాని చేస్తాయని, సహజరంగులు ఆనందాన్ని ఇస్తాయని ట్విటర్‌లో సూచించారు. హోలీ పండుగను సహజ రంగులతో సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. పసుపు సహజమైన రంగు. మీ భవిష్యత్తుకు శుభాన్నిస్తుంది అని పేర్కొన్నారు. మోసపూరిత వాగ్దానాలు కూడా సింథటిక్ రంగుల్లాంటివే అంటూ ట్వీట్‌ చేశారు. 

అయితే హోలీ శుభాకాంక్షల వరకు బాగానే ఉన్నా, పండగను కూడా పసుపురంగుతో ముడిపెట్టి రాజకీయ రంగుపులమడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మోససపూరిత వాగ్ధానాల విషయంలో చినబాబును నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. మోసపూరిత వాగ్ధానాలతో 2014లో అధికారంలోకొచ్చింది టీడీపీనే అంటూ మండిపడ్డారు. ట్విటర్‌లో యమా యాక్టివ్‌గా ఉండే లోకేశ్‌ గతంలో చేసిన ఓ ట్వీట్‌ను వెలికి తీసి మరీ ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆ ట్వీట్‌ ఏంటీ నెటిజన్ల రియాక‌్షన్‌ ఏంటో ఓసారి చూద్దాం.


'12 ఏళ్లలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు కలిసి హైదరబాద్‌లో మెట్రోరైలు కట్టలేకపోయారు. టీడీపీ ప్రభుత్వం మాత్రం 2018 డిసెంబర్‌నాటికి విజయవాడ మెట్రో పూర్తి చేస్తుంది' అంటూ 2016లో లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. 2018 ముగిసి 2019 కూడా ప్రారంభమైంది. అయినా విజయవాడలో మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క అడుగు కూడా పడలేదు. దీంతో హోలీ శుభాకాంక్షలు చెప్పాలని నారా లోకేశ్‌ చేసిన ట్వీట్‌ కాస్తా.. టీడీపీ మోసపూరిత వాగ్ధానాలపై సెటైర్లు వేయడానికి నెటిజన్లకు దొరికిన ఓ మంచి అవకాశంగా మారింది. దీంతో సామాజిక మాధ్యమాల్లోనే లోకేశ్‌తో నెటిజన్లు హోలీ ఆడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు