ఏపీ.. ట్రెండ్‌ సెట్టర్‌!

23 Feb, 2020 04:31 IST|Sakshi

అనుసరించడం కాదు.. ఆదర్శంగా నిలుస్తోంది 

ప్రభుత్వ నిర్ణయాలకు నెటిజన్ల జేజేలు 

తాజాగా పాలనా వికేంద్రీకరణ బాటలో కర్ణాటక 

దిశ బిల్లుపై అధ్యయనానికి మహారాష్ట్ర ప్రభుత్వ బృందం రాక 

ఏపీలో పోలీస్‌ వీక్లీ ఆఫ్‌పై నివేదిక కోరిన పలు ముఖ్య రాష్ట్రాలు 

‘స్పందన’ అమలు తీరుపైనా అనేక రాష్ట్రాల ఆసక్తి 

ఏపీ పోలీస్‌ టెక్నికల్‌ ఎగ్జిబిషన్‌పై ప్రధాని మోదీ ఇప్పటికే ప్రశంసలు 

సాక్షి, అమరావతి: అనుసరించడం కాదు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే నిర్ణయాలను తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త ట్రెండ్‌ సెట్‌ చేస్తోందని నెటిజన్లు జేజేలు పలుకుతున్నారు. రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం తీసుకున్న అనేక సంచలన, సాహసోపేత నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతోపాటు వాటిని అనుసరించేందుకు పలు రాష్ట్రాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రధానంగా.. పాలనా వికేంద్రీకరణ, దిశ బిల్లు, పోలీస్‌ వీక్లీ ఆఫ్, స్పందన వంటి నిర్ణయాలను అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. 

దశ‘దిశ’లా.. 
మహిళలు, బాలికల రక్షణకు దేశంలోనే ప్రప్రథమంగా ఆంధ్రప్రదేశ్‌లో తీసుకువచ్చిన దిశ బిల్లు తరహాలో చట్టం తెచ్చేందుకు పలు రాష్ట్రాలు సీరియస్‌గా పరిశీలిస్తున్నాయి. ఏపీ తరహాలో దిశ బిల్లు తెస్తామంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే ఇప్పటికే ప్రకటించారు. రెండ్రోజుల క్రితం మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ నేతృత్వంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం కూడా అమరావతికి వచ్చి ఏపీ కీలక అధికారులు, మంత్రులతో దిశ బిల్లు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు దిశ బిల్లు అద్భుత నిర్ణయమని ప్రశంసించారు కూడా. 

పాలనా వికేంద్రీకరణపై..
మూడు రాజధానులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపి పాలనా వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ పాలిత కర్ణాటక కూడా తాజాగా ఇదే బాట పట్టడం గమనార్హం. ఇందులో భాగంగా అక్కడి యడియూరప్ప ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లును ఆమోదించింది కూడా. అక్కడ బెంగళూరుతోపాటు బెళగాలిలో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. బెంగళూరు నుంచి కొన్ని కార్యాలయాలను ఉత్తర కర్ణాటకకు తరలించాలని ఆ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి సీఎం వైఎస్‌ జగన్‌ బాటలోనే బీజేపీ ముఖ్యమంత్రి యడియూరప్ప నడుస్తున్నారంటూ విద్యావంతులు, మేధావులు విశ్లేషిస్తున్నారు. దీనికితోడు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిని కూడా అనుసరిస్తూ కర్ణాటక సర్కారు కొద్ది రోజుల క్రితం తీర్మానం చేయడం విశేషం.

పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఓ సంచలనం.. 
ఇక 24 గంటలు కష్టపడే పోలీసులకు వారంలో ఒక రోజైనా విశ్రాంతి ఇవ్వాలనే ప్రతిపాదనను అమల్లోకి తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మరో నిర్ణయాన్ని కూడా అనుసరించేందుకు పలు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగాదీనికి సంబంధించి వివరాలు కోరిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఏపీ పోలీసు అధికారులు ఇప్పటికే నివేదించారు.   

అపూర్వ ‘స్పందన’.. 
ప్రజల కష్టాలు తీర్చే ‘స్పందన’ కార్యక్రమాన్ని అమలుచేసేందుకు పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీలో స్పందన అమలుచేస్తున్న తీరుతెన్నులపై కూడా అనేక రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయి. గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే ఏపీ పోలీసుల నుంచి వివరాలు సేకరించారు. కాగా.. ఇటీవల గుజరాత్‌లోని వదోదరాలో నిర్వహించిన పోలీస్‌ టెక్నికల్‌ ఎగ్జిబిషన్‌లో ఏపీ పోలీస్‌ స్టాల్‌లో ‘స్పందన’ అమలుతీరును అడిగి తెలుసుకుని ప్రశంసించారు. అంతేకాక.. దీనిపై పూర్తిస్థాయి నివేదికను ప్రధాని కోరడం గమనార్హం.  

మరిన్ని వార్తలు