'మంచిదే'..కానీ!

5 May, 2018 12:08 IST|Sakshi

పెళ్లి బంధం..నమోదుకు జంటల దూరం

అవగాహన కల్పించని సంబంధిత అధికారులు

ధ్రువీకరణ లేకుంటే పథకాలకు నూతన దంపతుల దూరం

పథకం సక్రమంగా అమలైతే బాల్య వివాహాలను అరికట్టొచ్చు

ఒంగోలు, బేస్తవారిపేట: మూడుముళ్లతో ఒకటవుతున్న యువతీయువకులు చట్టబద్ధత విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. అవగాహన లోపం, అవసరమొచ్చినప్పుడు చూసుకోవచ్చనే నిర్లప్తత వెరసి గ్రామ పంచాయతీల్లో పెళ్లి వివరాలు నమోదుపై నిర్లక్ష్యం చేస్తూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. వివాహ వివరాలను పంచాయతీ పరిధిలోనే నమోదు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో పెళ్లి వివరాలు నమోదైతే చాలా వరకు బాల్య వివాహాలు అరికట్టొచ్చు. పంచాయతీల్లో పెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చన్న అంశం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అధికారులు కూడా వీటిపై అవగాహన కల్పించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.చంద్రన్న పెళ్లి కానుక నూతన పథకానికి వధూవరుల పెళ్లి ధ్రువీకరణ తప్పనిసరి. దీనికి తోడు జిల్లా నుంచి యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేందుకు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు, సైనికులకు పెళ్లి ధ్రువీకరణ పత్రం అత్యంత అవసరం.

ఏటా వేల సంఖ్యలో పెళ్లిళ్లు
మార్కాపురం డివిజన్‌ పరిధిలో ఏటా వేలల్లో వివాహాలు జరుగుతున్నాయి. వివాహ నమోదులో పంచాయతీలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. అక్కడక్కడా దరఖాస్తు చేసుకున్న వారికి డిజిటల్‌ పద్ధతిలో కాకుండా చేతిరాత ద్వారా ధుృవీకరణ పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ శాతం పంచాయతీలకు అసలు దరఖాస్తులే రావడం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పెళ్లిళ్లకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించింది. మండలాల్లో వెలుగు కార్యాలయం పరిధిలో ధ్రువీకరణ పత్రం అందజేస్తేనే లబ్ధి చేకూరుతుంది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా  ఉంది. వివాహ నిర్బంధ చట్టాన్ని 2002లో తీసుకొచ్చారు. రెండో పెళ్లిని నిరోధించడం, మోసాలను అరికట్టాలన్నా లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు.

పెళ్లికి ముందే దరఖాస్తు
పంచాయతీలు, పురపాలక సంఘాల్లో జనన, మరణాలతో పాటు పెళ్లి నమోదు తప్పనిసరి చేశారు. పంచాయతీ అధికారి పెళ్లి అధికారిగా వ్యవహరిస్తారు. వరుడు 21, వధువు 18 ఏళ్లు నిండిన వారు పెళ్లికి అర్హులు. పెళ్లికి ముందే సంబంధిత పంచాయతీ అధికారికి వినతిపత్రం అందజేయాలి. దీని ఆధారంగా కార్యదర్శి పెళ్లి అనంతరం వధూవరుల నుంచి సంతకాలు సేకరించి సాక్షులను గుర్తించి పెళ్లి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు.

మరిన్ని వార్తలు