నవదంపతుల మృత్యువాత

30 Dec, 2013 02:32 IST|Sakshi
నవదంపతుల మృత్యువాత

 అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనలో అనంతపురానికి చెందిన కొత్త దంపతులు  మృత్యువాత పడినట్లు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. పిడుగులాంటి వార్త విన్న కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. దేవుడు ఆరునెలలకే ఆ దంపతుల జీవితాన్ని ముగించేశాడంటూ రోదించారు. మృతదేహాల కోసం అనంతపురం నుంచి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు. మృతదేహాలను బుధవారం అప్పగిస్తామని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో వారంతా అక్కడే పడగాపులు గాస్తున్నారు. అనంతపురంలోని నీలిమ థియేటర్ సమీపంలో పోస్టల్ కరస్పాండెంట్ క్లర్క్ చంద్రశేఖర్, అనసూయ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి శ్రీనివాస్ (28), శ్రీకాంత్ ఇద్దరు కుమారులు. ఇద్దరూ బెంగళూరులోని ప్రెవేట్ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.
 
 ఆరునెలల క్రితం తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీలతతో శ్రీనివాస్ వివాహం జరిగింది. శ్రీలత, శ్రీనివాస్ దంపతులు బెంగళూరులో ఉంటున్నారు. ఈ క్రమంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్లేందుకు వారు అనంతపురం రావాలనుకున్నారు. నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో శ్రీనివాస్ తన తండ్రి చంద్రశేఖర్‌కి ఫోన్ చేసి అనంతపురం వస్తున్నట్లు చెప్పాడు. ఇంతలోనే దంపతులిద్దరూ ప్రమాదంలో చిక్కుకున్నారని సమాచారం అందడంతో శ్రీనివాస్ తల్లిదండులు తల్లడిల్లిపోయారు. 24 గంటల అనంతరం శ్రీలత, శ్రీనివాస్ మృత్యువాత పడ్డారని విక్టోరియా ఆస్పత్రి వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

మరిన్ని వార్తలు