భార్యాభర్తల్ని కలిపిన ఎన్‌హెచ్‌ఆర్సీ

23 Apr, 2015 02:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:  కుమార్తె అనారోగ్య నేపథ్యంలో ఏర్పడిన వివాదం కారణంగా కొంత కాలంగా విడివిడిగా ఉంటున్న భార్యాభర్తల్ని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) ఒక్కటి చేసింది. భవిష్యత్తులో భార్య, కుమార్తెలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని భర్తను మందలించింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉన్న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివద్ధి సంస్థలో బుధవారం జరిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ క్యాంప్ సిట్టింగ్ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వారు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కమిషన్ విచారణ చేపట్టింది.
 
 అనంతపురం జిల్లా పెనగొండకు చెందిన శివశంకర్-సరోజమ్మ భార్యాభర్తలు. శివశంకర్ ఓ బ్యాంక్‌లో మెసెంజర్‌గా పని చేస్తున్నారు. వీరి కుమార్తె భీష్మకు కొన్నేళ్ళ క్రితం వైద్యం చేసిన వైద్యులు విరుద్ధ గ్రూపు రక్తం ఎక్కించడంతో ఆమె తీవ్ర అనారోగ్యానికి లోనైంది. కాళ్ళు సరిగ్గా పని చేయకపోవడంతో నడవలేని స్థితికి చేరింది. ఈ వ్యవహారంలోనే భార్యాభర్తల మధ్య స్పర్థలు తలెత్తాయి. శివశంకర్ భార్యను వేధించడంతో పాటు దూరంగా వెళ్ళిపోవడంతో సరోజమ్మ పెనుగొండ పోలీసులకు ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసినప్పటికీ పోలీసుల స్పందన సరిగా లేదంటూ సరోజమ్మ ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌లో జరిగిన క్యాంప్ సిట్టింగ్‌లో భాగంగా కమిషన్ సభ్యుడు జస్టిస్ సి.జోసెఫ్, రిజిస్ట్రార్ ఏకే గార్గ్‌లతో కూడిన బెంచ్ బుధవారం తొలికేసుగా ఈ పిటిషన్‌ను విచారించింది. కేసు పూర్వాపరాల పరిశీలన, పోలీసుల వివరణ విన్న జస్టిస్ జోసెఫ్ శివశంకర్ అందుబాటులో ఉన్నారా? అని ప్రశ్నించారు. దీంతో విచారణ హాలులోనే ఉన్న శివశంకర్ ముందుకు వచ్చారు. ఈ కేసులో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకుంటే నీకు భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వస్తాయని, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని శివశంకర్‌ను జస్టిస్ జోసెఫ్ హెచ్చరించారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారికి వైద్యం చేయించడం నీకు కష్టసాధ్యమవుతుందని సరోజమ్మతో అన్నారు.
 
  ప్రవర్తన మార్చుకుని భార్య, కుమార్తెలను చక్కగా చూసుకుంటానని హామీ ఇస్తే కేసు క్లోజ్ చేస్తానని శివశంకర్‌కు స్పష్టం చేశారు. దీనికి తాను సిద్ధంగా ఉన్నానని అతడు చెప్పడంతో భార్యాభర్తల్ని కలిపిన జస్టిస్ జోసెఫ్, రిజిస్ట్రార్ ఏకే గార్గ్‌లు ఆ మేరకు ఇరువురి నుంచి సంతకాలు తీసుకుని పిటిషన్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. భీష్మకు బెంగళూరులో జరుగుతున్న వైద్యం కొనసాగించాలని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి పొరపాటు చేసినా చర్యలు తప్పవని శివశంకర్‌ను హెచ్చరించారు. దీంతో భార్యాభర్తలు కుమార్తె భీష్మ సహా తిరిగి వెళ్ళారు.

మరిన్ని వార్తలు