‘సమాచార’ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు

23 Apr, 2015 02:07 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: ‘‘సమాచార హక్కు స్పూర్తిని దెబ్బతీసే విధంగా కొందరు ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారు. సమాచార కమిషనర్లు ఇచ్చే తీర్పులు, ఆదేశాలను పట్టించుకోవటం లేదు. మేము జిల్లాలకు వెళ్లిన సమయాల్లో కనీస ప్రోటోకాల్ పాటించకుండా అవమాన పరుస్తున్నారు.

సమాచార కమిషనర్లు వస్తే చీఫ్ సెక్రటరీ హోదాతో కూడిన ప్రొటోకాల్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారులు ఓ రహస్య జీవో (4046)ను జారీ చేసి ప్రజాసామ్యాన్ని అపహాస్యం చేశారు.’’ అంటూ  ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్‌హుస్సేన్‌తోపాటు సమాచార కమిషనర్లు రతన్, విజయబాబు, డాక్టర్ వర్రె వెంకటేశ్వరు, తాంతియా కుమారి, విజయనిర్మల, ఇంతియాజ్ అహ్మద్ గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. బుధవారం రాజ్‌భవన్‌లో వారు గవర్నర్‌ను కలిసి ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీతో పాటు తామిచ్చిన ఆదేశాలు,తీర్పులను బేఖాతరు చేసిన అంశాలకు సంబంధించిన ఆధారాలు అందజేశారు.దీనిపై గవర్నర్ స్పందిస్తూ త్వరలోనే రెండు రాష్ట్రాల  ప్రధాన కార్యదర్శులతో సమాచార హక్కుచట్టం అమలు తీరును సమీక్షిస్తానని వెల్లడించారు.


 ఆ జీవో హాస్యాస్పదం: సమాచార కమిషనర్లు
 గవర్నర్ నరసింహన్‌ను కలిసిన అనంతరం సమాచార కమిషనర్ విజయబాబు మీడియా తో మాట్లాడుతూ దాపరికం, అవినీతికి ఆస్కా రం లేని సుపరిపాలనే లక్ష్యంగా ఏర్పాటైన  కమిషన్ - కమిషనర్ల వ్యవస్థను నీరుగార్చే విధంగా ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో తాను పర్యటించిన సందర్భంలో ఇచ్చిన ఆదేశాలు, తీర్పులు అమలు చేసే విషయంలో అక్కడి కలెక్టర్  వ్యవహరించినతీరు అభ్యంతరకరంగా ఉందన్నా రు.

తనకు వ్యతిరేకంగా  సమావేశాలు పెట్టించి సమాచార హక్కు చట్టాన్నే ప్రశ్నించే వరకు వెళ్లటం, ఆ కలెక్టర్‌కు కొందరు ఐఏఎస్‌లు మద్దతునివ్వటం ఆశ్చర్యంగా ఉందన్నారు. సమాచార కమిషనర్లకు ఏర్పడుతున్న ఇబ్బందులను గతంలో పలు మార్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు దృష్టికి వెళ్లినా ప్రయోజనం లేకపోవటం వల్లే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాల్సి వచ్చిందని విజయబాబు తెలిపారు.  
 
 

మరిన్ని వార్తలు