రాత్రి గస్తీ.. రాబడి జాస్తి

18 Aug, 2014 00:38 IST|Sakshi
రాత్రి గస్తీ.. రాబడి జాస్తి

దృష్టి సారిస్తాం
 నైట్ బీట్ కానిస్టేబుళ్లు సొమ్ములు వసూలు చేస్తుండడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. నిఘా పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీసు సిబ్బంది వల్ల ఇబ్బందులు ఎదురైతే ఎవరైనా నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
 - ఎం. రవిప్రకాష్, జిల్లా ఎస్పీ
 
 కాకినాడ క్రైం :‘ఏ పుట్టలో ఏ పాముందో’ అన్నది పాత నానుడే కాగా.. ‘ఏ దారిలో ఏ పోలీసు మాటేశాడో’నన్నది వాహనదారుల నానుడిగా మారింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణించే వారు రోడ్లపై రక్షకభటుల జాడ కనిపిస్తేనే.. ’అయ్యబాబోయ్.. పోలీసులు’ అనుకుని గడగడలాడిపోతున్నారు.  రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట, తిమ్మాపురం, అచ్చంపేట జంక్షన్, పిఠాపురం, కత్తిపూడి, తుని, యానాం-ఎదుర్లంక వంతెన, మురమళ్ల, అమలాపురం, రావులపాలెం తదితర ప్రాంతాల్లో ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన కానిస్టేబుళ్లు ప్రతి రాత్రి గస్తీ కాస్తుంటారు. నేరాలు, ప్రమాదాల నిరోధానికి కృషి చేయడం, జరిగితే తక్షణ చర్యలకు ఉపక్రమించడం వారి విధి. కాగా.. ఆ డ్యూటీ మాటున వారు వాహనదారుల జేబులకు చిల్లి పెడుతున్నారు. గస్తీ అంటేనే రాబడి జాస్తి’ అన్నట్టు.. తమ బారి నుంచి తప్పించుకోజూసే వాహన చోదకులను వెంటాడి మరీ భారీగా మామూళ్లు దండుకుంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వాహన చోదకులు ప్రమాదాల బారిన పడ్డ సంఘటనలూ ఉన్నాయి.
 
 రాజానగరం నుంచి సామర్లకోట వరకూ ఏడీబీ రోడ్లో, సామర్లకోట నుంచి కాకినాడ బీచ్ రోడ్డు వరకూ ఉన్న ఏడీబీ రోడ్లో ఆయా ప్రాంతాల పోలీస్ స్టేషన్ల కానిస్టేబుళ్లు రాత్రి పహారా కాస్తూ వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ రోడ్లపై ప్రయాణం ఓ గండంగా మారిందని, గత్యంతరం లేక వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. వాహనదారులు మద్యం తాగి ఉన్నా, వ్యభిచారం వంటి కార్యకలాపాలపై వెళుతున్నారనుకున్నా బెదిరించి సొమ్ములు గుంజుతున్నారు.   ఇక లారీలు, ప్రైవేట్ బస్సులు, ఆటోలు వంటి వాహనాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. ‘పోలీసులతో ఎందుకొచ్చిన గొడవ’ అనుకుంటూ భారీ వాహనాల డ్రైవర్లు వారు ఆపిక ప్రతి చోటా రూ.50 చొప్పున సమర్పించుకుంటున్నారు.  
 
 సరుకులనూ దండుకుంటారు..
 ప్రయాణం సాఫీగా సాగుతుందని చాలా మంది వ్యాపారులు, వాహనదారులు సరుకుల రవాణాను రాత్రి పూట చేస్తుంటారు. దానిని కూడా గస్తీ కానిస్టేబుళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. చేతికి వచ్చిన సరుకులను తీసుకుంటున్నారని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కోసారి సరుకులు తగ్గడంతో వ్యాపారులు  కిరాయి తగ్గించి ఇస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. కానిస్టేబుళ్లకు ఎదురు చెపితే ఏదో ఒకసాకుతో వాహనాలు నిలిపివేసి సమయం వృథా చేస్తారని భావించి చాలా మంది సొమ్ములు ఇచ్చి బెడద తప్పించుకుంటున్నారు. సాధారణంగా వాహనాలు తనిఖీ చేసే అధికారం కానిస్టేబుళ్లకు లేకపోయినా.. దండుకోవడానికే హద్దు మీరుతున్నారని సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
 
 అయినా ఆగని అక్రమార్జన
 గతంలో పెద్దాపురం ఏడీబీ రోడ్లో చెక్‌పోస్ట్ వద్ద భారీ మొత్తంలో సొమ్ములు గుంజుతున్నారని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం రావడంతో రెక్కీ నిర్వహించారు. నలుగురు కానిస్టేబుళ్లు, ఒక హోం గార్డు (జీపు డ్రైవర్)ను సస్పెండ్ చేశారు. అనంతరం కానిస్టేబుళ్ల హవాపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఉన్నతాధికారులు రాత్రి పూట పోలీసు దందాపై దృష్టి సారించడం మానివేశారు. దీంతో గస్తీ కానిస్టేబుళ్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. గస్తీ లక్ష్యాన్ని విస్మరించిన కానిస్టేబుళ్లు కాసుల వేటలో నిమగ్నమవుతున్నారు. అసాంఘిక శక్తులు తమ పని తాము చేసుకుపోతున్నాయి. కానిస్టేబుళ్లను ప్రధాన సెంటర్లు, రహదారుల్లో కాక జనావాస ప్రాంతాల్లో గస్తీకి నియమిస్తే చోరీలు, హత్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాత్రి గస్తీ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం కారణంగానే 90 శాతం అసాంఘిక కార్యకలాపాలు, చోరీలు, హత్యలు జరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు గస్తీ కానిస్టేబుళ్ల దందాను అరికట్టాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు