అభ్యర్థులేరీ..?

7 Mar, 2014 02:54 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు
 మునిసిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం వేట ప్రారంభించింది. అభ్యర్థుల ఆశావహుల జాబితాతో హైదరాబాద్ రావాలని జిల్లా నాయకులకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నుంచి పిలుపు రావడంతో జిల్లా నుంచి నేతలు హైదరాబాద్‌కు బయలుదేరారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు కరువవడంతో తృతీయ శ్రేణి నాయకుల జాబితాతో జిల్లా నేతలు వెళ్లినట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షునిగా ఉన్న ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేయడంతో ప్రస్తుత ఒంగోలు నగర అధ్యక్షునిగా ఉన్న జడా బాల నాగేంద్రం డీసీసీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాల నాగేంద్రం, పీసీసీ కార్యదర్శి కోలా ప్రభాకర్ గురువారం హైదరాబాద్ వెళ్లినట్లు తెలిసింది. వీరు బొత్సతో శుక్రవారం భేటీ అయి మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. వారికే బీఫామ్‌లు కూడా ఇచ్చి అభ్యర్థులను పోటీకి దింపాలని బొత్స కోరనున్నట్లు సమాచారం.
 
  పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలోనే ఆదుకోవాలని, ఇతర నేతల్లాగా పార్టీలు మారడం సరికాదని వీరికి నచ్చజెప్పే యత్నం కూడా బొత్స చేయనున్నారు. జిల్లాలో పార్టీ చతికిలపడిందనే భావన రాకుండా, అన్ని వార్డుల్లో అభ్యర్థులుండేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిసింది. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో చైర్మన్ అభ్యర్థులను కూడా కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైఎస్ హయాంలో వైభవాన్ని చాటిన కాంగ్రెస్ పార్టీ, నేడు అభ్యర్థులను వెతుక్కోవాల్సి వస్తోందని ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా పార్టీ వీడే ఆలోచనలో ఉండటంతో జిల్లాలో పార్టీకి దశ, దిశ కరువయ్యే పరిస్థితి ఏర్పడింది.  ఇదిలా ఉండగా పూర్తి స్థాయి డీసీసీ అధ్యక్షుడిగా బాల నాగేంద్రంని నియమించే అవకాశ ం ఉన్నట్లు తెలిసింది. జిల్లా పూర్తి బాధ్యతలను ఆయనకు అప్పగించడానికి బొత్స నిర్ణయించుకున్నట్లు సమాచారం.
 
 

మరిన్ని వార్తలు