ప్రవేశం నిషేధం

28 Apr, 2018 13:15 IST|Sakshi
పిఠాపురం మున్సిపల్‌ కార్యాలయంలో మూసి ఉన్న గేటు , కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిబంధనల బోర్డు

పిఠాపురం పురపాలక సంఘంలో నిషేధాజ్ఞలు

దళారుల నియంత్రణ కోసమేనంటున్న అధికారులు

మండిపడుతున్న పుర ప్రజలు

పిఠాపురం: అది సెంట్రల్‌ జైలు కాదు, అలాగని నిషేధిత ప్రాంతం అసలే కాదు. హై సెక్యూరిటీ జోన్‌ కూడా కాదు. పోనీ కనీసం రోగులకు ఇబ్బంది కలుగుతుందనుకోవడానికి అది ఆసుపత్రి కానే కాదు. కానీ అక్కడెక్కడా లేని నిబంధనలు మాత్రం ఇక్కడ రాజ్యమేలుతున్నాయి. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య తప్ప ఉదయం ఎవ్వరూ అటువైపు వెళ్లరాదు. ఒకవేళ వెళదామన్నా వెళ్లనివ్వరు. అదేదో శ్రీహరికోటలోని ఉపగ్రహ తయారీ కేంద్రం అనుకుంటే పొరపాటే. అది పిఠాపురంలోని మున్సిపల్‌ కార్యాలయం. అక్కడకు వెళ్లాలంటే అర్జీదారులతోపాటు పురపాలక సంఘ సభ్యులు సహితం సమయ పాలన పాటించక తప్పదు. ఇందుకోసం ఉదయం నుంచీ మున్సిపల్‌ కార్యాలయం గేటు మూసివేసి, నిరంతరం సెక్యూరిటీ గార్డులతో కాపలా ఏర్పాటు చేశారు. నిర్ణీత సమయంలో గేటు దాటి లోపల అడుగు పెట్టాలన్నా కూడా.. గేటు వద్ద ఉన్న సిబ్బందికి ఏ పనిమీద, ఎవరికోసం వచ్చారు? ఏ సమయంలో లోపలకు అడుగుపెట్టారనే వివరాలను కచ్చితంగా ఇచ్చి వెళ్లాలని నిబంధనలు విధించారు.

ఇటీవల రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఓ బిల్లు కలెక్టర్‌ పట్టుబడిన సంఘటన జరిగిన నాటి నుంచి ఈ నిబంధన అమలు చేస్తున్నారు. గతంలో నిధుల దుర్వినియోగం కేసులో మున్సిపల్‌ అధికారులపై చర్యలు తీసుకున్న సమయంలోనూ ఇటువంటి నిబంధనలే అమలు చేయగా.. సర్వత్రా నిరసనలు వ్యక్తమవడంతో వాటిని సడలించారు. నిత్యం వివిధ పనుల కోసం వచ్చే అనేకమంది ఈ నిబంధనలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీల్డ్‌ వర్క్‌ అంటూ మూడు దాటితే సిబ్బందిలో అనేకమంది కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోతుంటారని, అలాంటి సమయంలో ఏ అధికారిని కలిసి ఏ పని చేయించుకోవాలని అర్జీదారులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఇలాంటి నిబంధన పెట్టిన స్థానిక మున్సిపల్‌ అధికారుల తీరును వారు దుయ్యబడుతున్నారు. ప్రజలకు నిత్యం సేవలందించే మున్సిపాలిటీలో.. అందునా సుమారు 70 వేల జనాభా ఉన్న పిఠాపురంలో ప్రజాసేవకు కేవలం రెండు గంటల వ్యవధి మాత్రమే ఇవ్వడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కేవలం కమిషనర్‌ను కలవడానికి మాత్రమే సమయ పాలన ఏర్పాటు చేయాలి తప్ప, ఇలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించేలా నిబంధనలు ఏర్పాటు చేయడం ప్రజల హక్కులను కాలరాయడమేనని విమర్శిస్తున్నారు. ప్రజలతో ఎన్నికైన కౌన్సిలర్లకు సహితం ఈ నిబంధన విధించడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.

సత్వర సేవల కోసమే..
ప్రజలకు సత్వరం సేవలందించడానికే ఈ నిబంధనలు పెట్టాం. కొందరు ఏ పనీ లేకపోయినా కార్యాలయంలో గంటల తరబడి ఉండి అధికారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దళారుల బెడద ఎక్కువగా ఉందనే ఫిర్యాదులు వస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలకు నిర్ణీత సమయంలో అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించడానికి ప్రయత్నిస్తాం.
– ఎం.రామ్మోహన్,కమిషనర్, పిఠాపురం మున్సిపాలిటీ

>
మరిన్ని వార్తలు