మాది పాశుపతాస్త్రం

4 Feb, 2014 03:03 IST|Sakshi
మాది పాశుపతాస్త్రం

హరిహరాదులు అడ్డొచ్చినా.. తెలంగాణ ఆగే ప్రసక్తే లేదు: దామోదర రాజనర్సింహ
 
 సాక్షి, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వద్ద బ్రహ్మాస్త్రం ఉంటే తమ వద్ద పాశుపతాస్త్రం ఉందని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. హరిహరాదులు అడ్డొచ్చినా.. తెలంగాణ ఆగే ప్రసక్తి లేదన్నారు.  సోమవారం నల్లొగొండ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పొందుపర్చారని, శ్రీ కృష్ణకమిటీని వేసినపుడు బీజేపీ, టీడీపీ, సీపీఎం కూడా అడ్డుచెప్పకుండా సానుకూలంగా స్పందించాయని తెలిపారు. కానీ నేడు ఏకాభిప్రాయం లేదని సీఎం కిరణ్ చెప్పడం ఆయన మూర్ఖత్వానికి నిదదర్శనమన్నారు. వందేళ్ల చరిత్రలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో ఆత్మబలిదానాలు, పోరాటాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తెలంగాణ ప్రకటన చేశారని, మరో 12 రోజుల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
 
 కాబోయే సీఎం దామోదర: కోమటిరెడ్డి
 
 మాజీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం... దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను ఒప్పించి తెలంగాణ ప్రకటన చేయించారని కొనియాడారు. ఆయన్ను తెలంగాణ ముఖ్యమంత్రిని చేయాలని సోనియాను కోరనున్నామని తెలిపారు. రాబోయే తెలంగాణలో ఆయనే సీఎం అని జోస్యం చెప్పారు. తెలంగాణ కోసం అందరం సమష్టిగా ఉద్యమిస్తుంటే జిల్లాకు చెందిన ఓ నాయకుడు శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని పరోక్షంగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు.

 


 

మరిన్ని వార్తలు