ఉద్యోగుల 'కియా' మొర్రో

23 Jul, 2019 11:21 IST|Sakshi

సాక్షి, పెనుకొండ(అనంతపురం) : ‘కియా’తో ఉద్యోగాలు లభిస్తాయని, తమ జీవితాలే మారిపోతాయని ఆశపడిన ‘అనంత’ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జిల్లాలో కంపెనీ ఏర్పాటైనా...అక్కడ ఉద్యోగుల్లో మనవాళ్లు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా.. కియా, దాని అనుబంధ సంస్థల్లో అమలు కావడంలేదు. పైగా ‘కియా’లో 80 శాతం మంది ఉద్యోగులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారే కావడంతో...తెలుగువాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిగంటలు పెంచడం...వారాంతపు సెలవు ఇవ్వకుండా తెలుగువారికి నరకం చూపిస్తున్నారు. చివరకు వారే విసిగిపోయి ఉద్యోగాలు వదిలి పారిపోయేలా చేస్తున్నారు. 

ఆది నుంచీ వివక్షే! 
‘కియా’ పరిశ్రమలో తెలుగువారిపై ఆది నుంచీ వివక్షే కొనసాగుతోంది. నైపుణ్యం పేరుతో వివక్ష చూపిస్తూ తమిళనాడు ప్రాంతానికి చెందిన వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. ‘కియా’ అనుబంధ పరిశ్రమ ‘హుందాయ్‌’ గతంలో తమిళనాడులో ఉండటం, ఆ చనువుతో తమిళనాడు ప్రాంతం వారికే ఇక్కడి ‘కియా’లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల్లో అరకొరగా ఉన్న తెలుగు ఉద్యోగులపై వేధింపులకు దిగుతున్నారు. వేతనాలు, పనిగంటలు, తదితర అన్ని విషయాల్లోనూ చిన్నచూపు చూస్తున్నారు.  

భూ బాధిత కుటుంబాలకూ దక్కని ఉద్యోగాలు 
‘కియా’ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాల పిల్లలు ఎందరో ఎంటెక్, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివినా కియాలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం అరకొరగా ఉన్న తెలుగువారికి సరైన గుర్తింపు లభించలేదు. ఈ విషయమై గతంలో పలుమార్లు ‘కియా’ పరిశ్రమ ఎదుటనే తెలుగువారు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు.

పరిశ్రమ కోసం భూములు సేకరించినప్పుడు స్థానికులకే  వందశాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు, నాయకులు వాటిని సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కనీసం భూబాధిత రైతుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నారు.  

‘సంగ్‌వూ’ ఎదుట ధర్నా 
తెలుగువారిపై చూపుతున్న వివక్షను నిరిస్తూ సోమవారం ఉదయం పెనుకొండ మండలం దుద్దేబండ సమీపంలోని కియా అనుబంధ కంపెనీ ‘సంగ్‌వూ’ హైటెక్‌ కంపెనీ ఎదురుగా తెలుగు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వారంతా అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. 

మరిన్ని వార్తలు