మాకు సెలవులు లేవా?

2 May, 2019 13:40 IST|Sakshi
అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులు

అంగన్‌వాడీ చిన్నారులకు వర్తించని వేసవి సెలవులు

పిల్లలకు తప్పని భానుడి సెగ

ఆందోళనలో చిన్నారుల తల్లిదండ్రులు

మండుటెండలో చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు, పెద్దలు నడు స్తుంటే తాము ఎండ వేడిమిని భరించి అయినా సరే.. చిన్నారులకు నీడనిచ్చి తాము ఎండలోఅడుగులేస్తారు. కానీ ప్రస్తుతప్రభుత్వం ప్రతి ఏడాది పాఠశాలలకు సెలవులిచ్చి చిన్నారులుఉండే అంగన్‌వాడీ కేంద్రాలకుమాత్రం ససేమిరా అంటుండడంతో ఐదేళ్లలోపు వయసున్న పిల్లలుఅవస్థలు పడుతున్నారు.

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు ఈ ఏడాది కూడా వేసవి సెగ తప్పేట్టు లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 50 రోజులపాటు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ఈనెల 23వ తేదీ ముగియడంతో 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారు. అయితే అంగన్‌వాడీ కేంద్రాలను మండుటెండలో సైతం నిర్వహిస్తుండడంతో చిన్నారులకు వేసవి సెగ తప్పదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 3621 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు వయసున్న 2.30 లక్షల మంది చిన్నారులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు.

వర్తించని వేసవి సెలవులు
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే అంగన్‌వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారులంతా ఏడాది నుంచి ఐదేళ్లలోపు వయసున్న వారే. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడం చిన్నారులకు అగ్ని పరీక్షగా మారిందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వసతుల లేమి, అద్దె భవనాలు, మండుటెండలు చిన్నారులకు శాపంగా మారాయి. జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలలో సగానికి పైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అరకొరగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో వసతులు లేవు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది డిసెంబరు నుంచి ఎండలు అధికమయ్యాయి. అంగన్‌వాడీ కేంద్రాలలో ఫ్యాన్లు కూడా లేవు. అద్దె భవనాలకు తగినంత బాడుగ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గ్రామాలలో వసతులు లేని ఇరుకైన ఇళ్లల్లో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో ఫ్యాన్లు అటుంచితే గాలి, వెలుతురు లేక చిన్నారుల కష్టాలు వర్ణణాతీతం. జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉదయం నుంచే భానుడి విశ్వరూపానికి చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు.

చిన్నారులతో చెలగాటం
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనివేళలను కుదించింది. ఈ ఏడాది మార్చి 18వ తేది నుంచి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 50 రోజుల వేసవి సెలవులు ఉండగా, ఐదేళ్లలోపు చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపజేయాలని కోరుతున్నారు.

వేసవి సెలవులు ఇవ్వాలి
ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు, కళాశాలలతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపజేయాలి. ఐదేళ్లలోపు చిన్నారులు వేసవిలో అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే ఎండ తీవ్రతతో అల్లాడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారులకు వేసవి సెలవులు ఇవ్వాలి.    – లక్ష్మిదేవి, జిల్లా కార్యదర్శి,    ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌

మరిన్ని వార్తలు