వనమా రాఘవేంద్రపై నాన్‌బెయిలబుల్ కేసు

2 Aug, 2013 04:40 IST|Sakshi

పాల్వంచ, న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం, చీరలను పంపిణీ చేస్తూ పట్టుబడిన మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేందర్‌రావుపై పాల్వంచ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. రూరల్ ఎస్సై పి.మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం... పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి వనమా రాఘవేందర్‌రావు తన కారులో మండలంలోని మొండికట్ట గ్రామానికి గత శుక్రవారం సాయంత్రం డబ్బులు, మద్యం, చీరలు పంచేందుకు వెళ్లారు.
 
 దీని సమాచారం అందుకున్న ఏఎస్పీ భాస్కర్ భూషణ్ అత్యంత చాకచ క్యంగా పట్టుకుని రూ. 3.62 లక్షల నగదు, సుమారు 100  చీరలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాల్వంచ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసులు నమోదు చేశారు. అయితే తిరిగి అదే రోజు అర్ధరాత్రి మొండికట్టలోనే వనమా రాఘవేంద్రరావు డబ్బులు, మద్యం, చీరలు పంచుతున్నట్లు ఏఎస్పీకి సమాచారం అందింది. దీంతో ఆయన అక్కడికి వెళ్లి రాఘవేంద్రరావును అరెస్టు చేశారు. ఈ సందర్బంగా రూ.15 వేల నగదు, 15 మద్యం బాటిళ్లు, 20 చీరలతోపాటు ఆయన ప్రయాణించిన ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావుపై 336, 353, 188, 34ఏ, 214, 211, ఏపీపీఆర్ యాక్టుల ప్రకారం  నాన్ బెయిలబుల్ కేసును గురువారం నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు