ఆరోగ్యంపై భరోసా కరువు

18 Dec, 2018 08:31 IST|Sakshi

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) నిలుపుదల

ఆరోగ్యరక్ష లబ్ధిదారులపైనా  ప్రభుత్వ వింతపోకడ

ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు

శ్రీకాకుళం: ప్రతి పేదవాడికీ కార్పొరేట్‌స్థాయి వైద్యం అందించాలన్న ఉద్దేశంతో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం తూట్లు పొడిచింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్‌ వైద్యసేవగా పేరుమార్చి మొదట్లో హడావుడి చేసిన సర్కారు తర్వాత ఆ పథకాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తూ వస్తోంది. తాజాగా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ) సేవలను నిలిపివేయడంతో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా లేకుండాపోయింది. ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్లు బకాయి ఉండడంతో సోమవారం నుంచి అన్నిప్రైవేటు ఆసుపత్రులు ఎన్టీఆర్‌ వైద్యసేవను నిలుపుదల చేశారు. ఏడాది కాలంగా బకాయిలు చెల్లించకపోతే తాము ఎలా నెట్టుకు రాగలుగుతామని ఆయా యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.

బకాయిలు చెల్లిస్తేనే సేవలు..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేదలకు వారి ఆరోగ్యంపై భరోసా కల్పించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టగా, ఆయన హయాంలో పేదలు ఆరోగ్యంపై ధైర్యంగా ఉండేవారు. ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ఈ పథకాన్ని నిర్వీర్యం చేశాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకం పరిస్థితి మరింత దయనీయంగా మారిది. పథకానికి పేరుమార్చి ఆరోగ్యశ్రీ నుంచి పలు రోగాలను తొలగించి పేదలకు షాకిచ్చింది. ఉన్న కొన్నిపాటి జబ్బులకు ఏదోలా వైద్యం చేయించుకుంటూ ఉండేవారు. ఇంతలో ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్, స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్లు ప్రభుత్వం బకాయిలపై స్పష్టమైన హామీని ఇచ్చేవరకు వైద్యసేవలను అందించేది లేదని కరాఖండిగా చెబుతున్నారు.

ఇదీ పరిస్థితి..
జిల్లాలో ఆరు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలు అందుబాటులో ఉండగా, వీటికి రూ.30 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోయినా ఆస్పత్రులు మాత్రం జీఎస్‌టీ, ఆదాయపుపన్నును తమ నిధుల నుంచి కట్టాల్సి వస్తుండడంతో ఎదురు పెట్టుబడి పెట్టినట్లు అవుతోంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద 1,044 రకాల వైద్య సేవలు అందిస్తున్నారు.  ప్రతిరోజు 10 వరకు శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఇలా నెలలో 300 వరకు శస్త్ర చికిత్సలు, 500 వరకు ఇతర వైద్య సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వైద్యసేవలను బంద్‌ చేయడంతో పేద రోగులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా గుండె, నరాలు, క్యాన్సర్, గైనిక్, ఎపండిసైటిస్, ఎముకల సంబంధిత శస్త్ర చికిత్సలు అవసరమైన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరందరికీ ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులే ఆధారం కానున్నాయి. ఆయా ఆసుపత్రుల్లో నిపుణులు లేకపోవడం, కొన్ని శస్త్ర చికిత్సలు చేసేందుకు పరికరాలు లేకపోవడం వంటివి రోగులను వేధిస్తున్నాయి. ప్రైవేటుగానే వైద్యం చేయించుకోవాలంటే సొంత డబ్బులను ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరితోపాటు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులకు కూడా ఈ వైద్యసేవలు దూరమవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆరోగ్యరక్షను నీరుగార్చిన ప్రభుత్వం
చంద్రబాబు ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా తయారైంది. ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెడుతూ ఈ పథకం ద్వారా ఆరోగ్యరక్షను పొందాలనుకొనేవారు రూ.1200 చెల్లించి రాష్ట్రంలోని ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చని పేర్కొంది. దీనిని నమ్మి జిల్లాలో 2196 మంది ఆరోగ్యరక్ష పథకంలో ప్రీమియం చెల్లించి లబ్ధిదారులుగా చేరారు. ఇప్పుడు ప్రభుత్వం 123 శస్త్ర చికిత్సలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆరోగ్యరక్ష లబ్ధిదారులు చేయించుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఆవేదన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ పరిధిలోనికి రానివారికి 2017లో ప్రభుత్వం ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రీమియం చెల్లించి కొంత ధీమాగా వున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తాజా జీవో ద్వారా షాక్‌ ఇచ్చింది. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో సైతం వైద్యం చేయించుకోవచ్చన్న ధీమాతోనే పలువురు లబ్ధిదారులు ప్రీమియం చెల్లించారు. ఇప్పుడు దీనిని కాదనడంపై సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 600కు పైగా వున్న నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో 1044 వ్యాధులకు నగదు రహిత వైద్యం చేయించుకోవచ్చని తొలుత పేర్కొన్న ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమైన 123 శస్త్ర చికిత్సలు, మరికొన్ని వైద్యసేవలను ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. ఆయా ఆస్పత్రుల్లో వీటికి అవసరమైన సౌకర్యాలు లేకపోయినా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా ఆదేశాలను జారీ చేయడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆరోగ్యంపై భరోసాను కోల్పోతున్నారు. తమను ఆదుకొనే వారి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వార్తలు