ఐదు కాదు మూడు గుడ్లే 

16 Jul, 2018 12:54 IST|Sakshi
సీతంపేటలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు   

 సీతంపేట : విద్యార్థులకు సరైన పోషకాహారాన్ని అందించడంలో భాగంగా మధ్యాహ్న భోజన పథకంలో వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు ఇస్తామని ప్రకటించిన విద్యాశాఖ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. జూలై 1 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించినా ఎక్కడా అమలు కావట్లేదు. 15 రోజులైనా ఐదు గుడ్లు లేవు. వారానికి మూడు గుడ్లు మాత్రమే అమలు చేస్తున్నారు. అవి కూడా చిన్న పరిమాణంలో వస్తున్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. 

గోళీ సైజులో కోడి గుడ్లు

జిల్లాలో 3308 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2428 ప్రాథమిక, 430 ప్రాథమికోన్నత, 450 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 20 లక్షల మంది 1 నుంచి 10వ తరగతి వరకుచదువుతున్నారు. వీరికి వారంలో ఇప్పటివరకు కేవలం మూడు గుడ్లు మాత్రమే పెడుతున్నారు. పాఠశాల పనిదినాల్లో శనివారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో గుడ్లు వడ్డించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కోడి గుడ్లు గోళీల పరిమాణంలో సరఫరా చేస్తున్నారు. వారానికి సరిపడా గుడ్లు సంబంధిత పాఠశాలలకు ముందే చేరవేయడంతో అవి పాడైపోతున్నాయి. అంతేగాక ఇవి బరువు తక్కువగా ఉన్నాయి. వీటిని తిరస్కరించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తోందని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు తెలియజేస్తున్నాయి.

వాస్తవానికి సప్లయిర్‌ ఇలా పాడైన గుడ్లు నిల్వ చేస్తే హెచ్‌ఎం తీసుకోకూడదు. ఇంతక ముందు సరఫరా చేసిన గుడ్లులో ఏమైనా పాడైనా లేదా ఉడకబెట్టిన తర్వాత పాడైనట్టు గమనిస్తే పిల్లలకు పెట్టకూడదు. వీటికి బదులు నాణ్యమైన గుడ్లు సప్లయర్‌ నుంచి తీసుకోవాలి.

సప్లయిర్‌ నిరాకరిస్తే ఈ విషయాన్ని ఎంఈవో, డీవైఈవో, జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేయాలి. పాఠశాలకు అందిన గుడ్లు నిల్వ చేసే ప్రదేశంలో గాలి తగిలేలా ఏర్పాటు చేసుకోవాలి. మూసి ఉంచిన అల్మారాల్లో బాక్స్‌లో ఉంచకూడదు. అనేక నిబంధనలు ఉన్నా ఇప్పటి వరకు ఐదు గుడ్లు పెట్టిన దాఖలాలు కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు