నీరాజనం

12 Feb, 2016 01:11 IST|Sakshi
నీరాజనం

 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం ...
 చిన్నా పెద్దలతో సహా తరలివచ్చిన చిరుమామిళ్ల గ్రామం
 ఘనంగా మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి విగ్రహావిష్కరణ

 
 చిలకలూరిపేట :  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు నీరాజనం పలికారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన జగన్‌కు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఎదురేగి స్వాగతం పలికారు. గ్రామగ్రామాల నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చి మండుటెండను సైతం లెక్కచేయకుండా మధ్యాహ్నం నుంచే రోడ్లపై జగన్ కోసం బారులు తీరారు. జగన్ చిరుమామిళ్ల వెళ్లే మార్గం కిక్కిరిసి పోయింది. అడుగు తీసి అడుగు వేయటం కష్టంగా మారింది. యడ్లపాడు, బోయపాలెం, లింగారావుపాలెం, చిరుమామిళ్ల  గ్రామాల్లో జగన్ రాకను స్వాగతిస్తూ  నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆబాలగోపాలం దారి పొడువునా  బారులు తీరారు. జగన్ కోసం గ్రామాల్లో వేలాది వాహనాలతో ర్యాలీలు నిర్వహించారు. బోయపాలెం నుంచి చిరుమామిళ్ల వరకు మోటార్‌బైకులతో యువకులు ర్యాలీ నిర్వహించారు.  జననేత కోసం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు, అభిమానులు, మహిళలు నాదెండ్ల మండలం చిరుమామిళ్ల చేరుకున్నారు.  పొలం పనుల నుంచి వచ్చే కూలీలు, పాఠశాలల నుంచి విద్యార్థులు,  చూడాలని వచ్చిన చిన్నారులు, వైఎస్ వల్ల లబ్ధిపొందిన పలువురు మహిళలు విశేషంగా తరలివచ్చారు. జగన్‌కు అడుగడుగునా అభిమానం అడ్డుపడింది. పూలవాన కురిపిస్తూ, భారీ స్థాయిలో బాణసంచా కాలుస్తూ అభిమానులు సందడి చేశారు. జగన్  ప్రయాణించిన మార్గం అంతా పూలతో నిండిపోయింది.


 నాడు షర్మిలకు..నేడు జగన్‌కుచిరుమామిళ్ల ప్రజల ఆత్మీయ స్వాగతం ...
 2013 మార్చి 12 .. మరో ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో షర్మిల పర్యటించారు. నాదెండ్ల మండల పర్యటలో ఉన్నప్పుడు మహిళలు తమ గ్రామానికి రావాలని పట్టుబట్టారు. రూట్ మ్యాప్ ప్రకారం యాత్ర కొనసాగుతుందని,  అయినా చిరుమామిళ్ల వస్తానని చెప్పిన మాటను షర్మిలమ్మ నిజం చేసి దివంగత నేత వైఎస్‌ఆర్, మాజీ ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానందరెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు.ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాల పక్కనే ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాల కోటిరెడ్డి విగ్రహాన్ని జననేత జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించటం విశేషం.

>
మరిన్ని వార్తలు