తప్పించుకుంటున్నారే గాని పనిచేయడం లేదు సారూ..

24 Dec, 2013 03:27 IST|Sakshi

  ‘జీవితంలో అన్నీ కోల్పోయాం. మా కష్టాలు తీర్చండని వేడుకుంటున్నా...ఎవరూ పట్టించుకుంటలేరు. మండలంలో ఉండే సారోళ్లు ఇప్పుడు..అప్పుడు అంటూ తిప్పించుకుంటున్నారే గానీ పనిచేయడం లేదు. కష్టమైనా ఈడికొచ్చి మీకు సెప్పుకుంటున్నం. మీరైనా మా కష్టాలు తీర్సండి సారూ...’ అని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు ఏజేసీ ఎల్.శర్మణ్ వద్ద వేడుకున్నారు. ప్రజావాణి సందర్భంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జేసీతో పాటు డీఆర్వో రాంకిషన్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రవీందర్, డ్వామా పీడీ హరిత, ఇతర అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
 - న్యూస్‌లైన్, జెడ్పీ సెంటర్
 
 పింఛన్ బంద్ చేశారు
 ‘ నాది ఓ కాలు పూర్తిగా పోయిం ది. వస్తున్న వికలాంగుల పింఛన్‌ను అధికారులు అన్యాయంగా తొ లగించారు.  మా గ్రామం మహబూబ్‌నగర ము న్సిపాలిటిలో విలీ నం అయింది. అప్పటి నుంచి పింఛన్ రావడం లేదు. మూడు టైర్ల సైకిల్ కోసం అధికారుల సుట్టూ ఎన్ని సార్లు తిరిగినా లాభం లేదు. మీరైనా నాకు పింఛన్, మూడు టైర్ల సైకిల్ ఇప్పించండి’ అని హన్వాడ మండలం చిన్పదర్పల్లికి చెందిన ఎద్దుల గట్టన్న విన్నవించారు.
 
 వితంతు పింఛన్ ఇప్పించండి
 ‘ నా భర్త చనిపోయి తొమ్మిది నెలలు అవుతోంది. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి జీవనం భారంగా మారింది. ఏ ఆధారం లేని నాకు వితంతు పింఛన్ ఇచ్చి ఆదుకోండి. నా భర్త చనిపోయినందుకు అపద్బాంధు స్కీం కింద రావాల్సిన పైసలు కూడా నాకు ఇవ్వలేదు. దయచేసి నా సమస్య తీర్చండి’ అని ధరూర్ మండలం మన్నపురం గ్రామానికి చెందిన రాములమ్మ వేడుకుంది.
 
 మా రేషన్‌కార్డు తొలగించారు
 ‘అన్యాయంగా మా గ్రామ రేషన్‌డీలర్ 35 మం ది రేషన్‌కార్డులను తొలగించాడు. నిరుపేదలైన మాకు ఏ ఆధారం లేదు. ఉద్దేశపూర్వకంగానే డీలర్ శంకరయ్య తెల్లరేషన్ కార్డులను జాబితా నుంచి తీసేసిండు. ఇదేమని అడిగితే దౌర్జన్యానికి దిగుతోండు. మేము ఆర్నెళ్లుగా పస్తులుంటున్నాం. మీరైనా ఆదుకోండి’ అని బిజినేపల్లి మండలం శాయిన్‌పల్లికి చెందిన గ్రామస్తులు జేసీకి విన్నవించారు.
 
 గ్రామానికి నీళ్లిచ్చి ఆదుకోండి
 ‘మా గ్రామానికి స త్యసాయి ైపైప్‌లైన్ ద్వారా మంచినీళ్లు వస్తున్నాయి. ఈ పై ప్‌లైన్లు తరుచూ పగ లడం, లీకవ్వడంతో మేమంతా ఇబ్బం దులు పడాల్సి వ స్తోంది. అందరం కలిసి సొంత ఖర్చులతో 20 బోర్లు వేసుకున్నాం. ఇందులో ఒక్క బోరు కూడా ఇప్పుడు పని చేయడం లేదు. దీంతో తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నాం. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకుంటలేరు. గ్రామంలో 2500 జనాభా ఉంటుంది. ఇంతమంది ప్రజల సమస్యను అర్థం చేసుకుని గ్రామానికి నీళ్లిచ్చి ఆదుకోండి’ అని నర్వ మండలం ఉందేకోడ్ గ్రామస్తులు జేసీని కోరారు.


  ఇంటిస్థలం ఇవ్వండి
 ‘మేము ఉండడానికి గూడు లేక వీధిన పడ్డాం. ఎనుగొండ పరిధిలోని లక్ష్మినగర్‌తండా, బీసీ కాలనీ, ఎనుగొండ తండాకు చెందిన దాదాపు 50 కుటుంబాలం ఉన్నాం. మాకు ఇళ్ల లేక కిరాయి ఇళ్లలో ఉంటున్నాం. మా గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం అయినప్పటి నుంచి మాకు సమస్యలు ఎక్కువయ్యాయి. బడానేతలు వందల ఎకరాలు కబ్జాలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం నిరుపేదలైన మాకు 70 గజాల ఇళ్ల స్థలం ఇవ్వడానికి అధికారులకు చేతులు రావడం లేదు. వెంటనే మాకు 70 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి’ అని పలువురు ఎనుగొండ వాసులు కలెక్టర్‌ను కోరారు.
 
 పింఛన్ ఇప్పించండి...
 ‘నేను వికలాంగురాలిని. ఐదేళ్లుగా తిరుగుతున్న నాకు పింఛన్ ఇప్పించండి సారూ. అధికారులకు ఎన్నిసార్లు సెప్పినా పట్టించుకుంటలేరు. నాకు ఏ ఆధారం లేదు. జీవనం కష్టంగా ఉంది. రేషన్‌కార్డు లేదని పింఛన్ ఇయ్యడం లేదు. నాపై దయజూపి వికలాంగుల పింఛన్ ఇప్పించండి సారూ’ అని నవాబ్‌పేట మండలం చౌడూరుకు చెందిన సుగుణమ్మ జేసీని వేడుకుంది.
 
 అంధ వికలాంగులపై వివక్ష చూపుతున్నారు
 ‘అంధ వికలాంగుల మైన మాపై ప్రభు త్వ చిన్నచూపు చూ స్తోంది. మాకు చెం దాల్సిన ఉద్యోగాల ను ఇతరులకు కేటాయిస్తున్నారు. వందశాతం వికలత్వం ఉన్న వారిని కాదని కేవలం 40 శాతం వికలత్వం ఉన్న వారికే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఇప్పటికే ఉద్యోగం ఉన్న వారికి ఇతర ఉద్యోగాలు ఇచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాగ్‌లాగ్ పోస్టుల్లో మాకు అవకాశం కల్పించండి.’ అంధ వికలాంగ మహిళలు కోరారు.
 
 నా భర్త ఉద్యోగం ఇప్పించండి సారూ...
 ‘నా భర్త కావల్‌కార్ ఉద్యోగం చేస్తూ మూడేళ్లక్రితం మృతి చెందాడు. ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. అప్పటి నుంచి ఎంత మంది అధికారుల చుట్టు తిరిగినా ప్రయోజనం లేదు. నేను నడవ లేను.   నా కొడుకుకు నా భర్త ఉద్యోగం ఇప్పించండి సారూ’ అని భూత్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన తలారి పెద్దలక్ష్మమ్మ జేసీని వేడుకున్నారు.
 
 
 

>
మరిన్ని వార్తలు