బతుకు భారమైందా..తల్లి..!

5 Nov, 2018 12:58 IST|Sakshi
అవ్వకు మంచినీరు అందిస్తున్న పోలీసు ఆగని కన్నీటిని తుడుచుకుంటూ

పేగుబంధం.. నీవు భారమయ్యావందో?.. పైనబడ్డ వయస్సుతో పోరాటం ఎందుకనుకుందో?..ఓ అవ్వ కృష్ణా నదిలో దూకి తనువుచాలించాలనుకుంది. అంతలో ట్రాఫిక్‌ పోలీసు వృద్ధురాలిని వారించడంతో తన బాధలు  చెప్పుకుంది.

కృష్ణాజిల్లా : పేగుబంధం.. నీవు భారమయ్యావందో?.. పైనబడ్డ వయస్సుతో పోరాటం ఎందుకనుకుందో?..  సూటిపోటిమాటలు పడలేక.. చావు దారి వైపు పంపాయో.. ఏమోకానీ.. ఓ ముదుసలి తల్లి భారంగా బెజవాడ చేరింది. కృష్ణలో దూకి భవబంధాల నుంచి విముక్తిపొందాలనుకుంది. ఆదివారం ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుంది.   అంతలో ఓ ట్రాఫిక్‌ పోలీసు కంటపడింది. ‘ఎవరమ్మానీవు ఇక్కడేం చేస్తున్నావు’? అని వాకబుచేస్తే.. ‘పుట్టెడు కష్టం కళ్లలో మోస్తూ.. భయం భయంగా నన్ను వదిలేయి బాబు.. బతకాలని లేదు.. కృష్ణలో దూకి చచ్చిపోదామని వచ్చా..’ అంటూ కన్నీరు కార్చింది. తన పేరు కె.మార్తమ్మ అని,  కంకిపాడు సమీపంలోని కోలవెన్ను గ్రామమని తెలిపింది. ‘నిన్ను ఎవరైనా ఇబ్బందిపెట్టారా?  అవ్వా.. పిలిపించి మాట్లాడతాను అని పోలీసు ప్రశ్నించినా?..’ ఆగని కన్నీటిని తుడుచుకుంటేనే గుండెలో బాధ బయటపెట్టలేక పోయింది. దీంతో అవ్వను పోలీసులు ఆటోలో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆమె కుమారుడు, మనుమడు, అల్లుడిని పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అవ్వను చక్కగా చూసుకోవాలని చెప్పి ఇంటికి సాగనంపారు.

>
మరిన్ని వార్తలు