నా భర్త ఆత్మహత్యాయత్నంపై రాజకీయాలొద్దు: టీచర్‌ మల్లేష్‌ భార్య

11 Dec, 2023 15:40 IST|Sakshi

సాక్షి, అనంతపురం:  ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. జగనన్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాల్లో.. బాబు అనుకూల మీడియా సంస్థలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా టీచర్‌ మల్లేష్‌ ఆత్మహత్యాయత్నం కేసును ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఆ ఆరోపణల్ని బాధిత కుటుంబమే స్వయంగా ఖండించింది. 

వేతనం రాలేదని.. సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని మల్లేష్ భార్య శివలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ ఖండించారు. ‘‘ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు.  నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దు’’ అంటూ ప్రతిపక్ష పార్టీలను కోరారామె. మరోవైపు బావ ఆదినారాయణ కూడా సోషల్‌ మీడియాలో, యెల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. 

సీఎం జగన్‌ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ ఈనాడు, యెల్లో మీడియాలు హైలెట్‌ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లేష్‌ కుటుంబం ఈ ప్రచారాన్ని ఖండించింది. 

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పందేలతో లక్షలు పొగొట్టుకోవడంతో పాటు కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్‌ల్లో, యాప్‌ల్లో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలు భరించలేక ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

>
మరిన్ని వార్తలు