అనుకున్నట్లే అయింది

22 Jan, 2014 02:45 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ‘కొండను తవ్వి ఎలుకను పట్టారన్నట్లు’గా ఎంపీఎండీసీ పరిస్థితి తయారైంది. ఆన్‌లైన్ టెండర్ల ద్వారా లాభాలు గడిస్తామని చెప్పుకురావడం మినహా భారీ నష్టాలను చవిచూశారు. ఇదంతా బడా పారిశ్రామికవేత్తలకు వంతపాడేందుకేనని రూఢీ అయ్యింది. అధికార పార్టీ కనుసన్నల్లో ప్రజాధనం లూటీకి పరోక్షంగా సహకరించారు. ప్రస్తుత ధరతో కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన బయ్యర్ల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారు. వెరసి చిన్నతరహా పరిశ్రమల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చారు.
 
 ‘వడ్డించేవారు మనవారైతే కడబంతి అయితేనేం’ అన్నట్లుగా బడా పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా అధికారులు చేతివాటం ప్రదర్శించారు. చిత్త శుద్ధితో టెండర్లు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటూనే, పాలకపక్షాన్ని నమ్ముకున్న వారికి న్యాయం చేయడంలో సఫలమయ్యారు. సొరచేపల ఎదుట చిన్న చేపల ఉనికి ప్రశ్నార్థకంగా మారినట్లుగా మంగంపేట సీ, డీ గ్రేడ్ బెరైటీస్ టెండర్ల ప్రక్రియ తయారైంది. ఆ బెరైటీస్‌నే నమ్ముకొని జీవిస్తున్న 150 పల్వరైజింగ్ మిల్లులు, వాటిలో పనిచేస్తున్న ఐదువేల మందికి పైగా కార్మికుల ఉపాధి భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) బడా బయ్యర్లకు అనుకూలంగా వ్యవహరించింది. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన టెండర్లలో రూ.112.65 కోట్ల ఆదాయానికి గండికొట్టారు. ఆ మొత్తం బడా వ్యక్తులకు దోచిపెట్టేందుకు సహకరించారు.
 
 ప్రజాధనం లూటీకి సహకారం..
 ఏపీఎండీసీ యంత్రాంగం వైఖరి కారణంగా పెద్ద ఎత్తున ప్రజాధనానికి గండి పడింది. పరోక్షంగా బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టేందుకు తోడ్పాటునిచ్చారు. ప్రస్తుతం టన్ను రూ.1926లతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్ టెండర్ల నిర్వహణలో టన్ను ధర రూ.1120గా నిర్ణయించారు. పోటీ కారణంగా మరింత ఆదాయం గడిస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే అత్యధిక ధరగా రూ.1175 టన్ను ధరను చెన్నైకి చెందిన ఓరన్ హైడ్రోకార్బొరేట్ కంపెనీ కోట్ చేసింది. మిగతా కంపెనీలు అంతకంటే తక్కువ ధరకు కోట్ చేసినట్లు సమాచారం.
 
 ఈ లెక్కన ప్రస్తుత ధరతో పోలిస్తే టన్నుకు రూ.751 ఆదాయాన్ని ఏపీఎండీసీ కోల్పోవలసి వచ్చింది. అంటే 15లక్షల టన్నులపై సుమారు రూ.112.65కోట్లు పైబడి నష్టాన్ని చవిచూస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రజాధనాన్ని బడావ్యక్తులకు యాజమాన్యం దోచి పెట్టిందనే చెప్పవచ్చు. తాము మునపటి రేటుకు కొనుగోలు చేస్తామని ముందుకు వచ్చిన స్థానిక బయ్యర్లను కాదని ఎగుమతిదారులకు అవకాశం కల్పించేందుకు యంత్రాంగం ప్రత్యక్షంగా సహకరించిందనే ఆరోపణలు నిజం చేస్తున్నాయి.
 
 ప్రశ్నార్థకంగా మారిన చిన్నతరహా పరిశ్రమలు
 మంగంపేట బెరైటీస్ ఆధారంగా నెలకొల్పిన సుమారు 150 పల్వరైజింగ్ మిల్లుల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారనుంది. ఆన్‌లైన్ టెండర్లలో పాల్గొన్నవారికి మాత్రమే సీ, డీ గ్రేడ్ బెరైటీస్ అప్పగించనున్నట్లు నిబంధనలు పొందుపర్చారు. గత ఏడాది మార్చిలో నిర్వహించిన ఆన్‌లైన్ టెండర్లలో హెచ్చు పాటదారుడు రేటు చెల్లించిన ప్రతి మిల్లు యజమానికి సంవత్సరంలో 5వేల మెట్రిక్ టన్నుల బెరైటీస్ అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. ఈమారు టెండర్లలో పాల్గొన్నవారు మినహా ఇతరులకు ఖనిజం కేటాయించే అవకాశాలు లేవని స్పష్టంగా నిబంధనల్లో పేర్కొన్నారు.
 
 ప్రస్తుతం 15లక్షల మెట్రిక్ టన్నులను బడా పారిశ్రామిక వేత్తలు దక్కించుకున్నారు. రూ.50లక్షల ఈఎండీ చెల్లించగల్గిన స్థోమత ఉన్న వారు మాత్రమే పాల్గొనడంతో చిన్నతరహా మిల్లుల యజమానుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వీటిపై ఆధారపడి జీవిస్తున్న ఐదు వేల మంది కార్మికుల ఉపాధి కూడా ప్రశ్నార్థకం కానుంది. మునుపటి లాగా ప్రతి మిల్లుకు 5వేల మెట్రిక్ టన్నులు కేటాయించే సాంప్రదాయాన్ని కొనసాగించే మిల్లుల యజమానులకు కూడా లబ్ధి చేకూరనుంది.
 

>
మరిన్ని వార్తలు