తగ్గుముఖంపట్టిన ఉల్లిధర

31 Aug, 2013 01:34 IST|Sakshi

 పరిగి, న్యూస్‌లైన్: రెండు నెలలకు పైగా వినియోగదారులకు కన్నీళ్లు పెట్టించిన ఉల్లి కాస్త శాంతించింది. ఉల్లిధరలు కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో ఉల్లి ధరలు కాస్తా దిగివచ్చాయి. గత వారం పరిగి మార్కెట్‌లో కిలో ఉల్లిధర రూ. 60 నుంచి 70 వరకు విక్రయించగా ఈ వారం ఆధరలు 40 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గాయి. శుక్రవారం పరిగి మార్కెట్‌లో   తెల్లరకం ఉల్లిగడ్డ కిలో రూ. 40 నుంచి 50 వరకు విక్రయించగా, ఎర్రఉల్లిగడ్డలు కిలో రూ.30 చొప్పున విక్రయించారు. దీంతో వినియోగదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో టమాటా ధరలు సైతం తగ్గుముఖం పట్టాయి.
 
  గతవారం కిలో టమాటాలు రూ. 30కి విక్రయించగా ఈ వారం కిలో టమాటాలు రూ. 15నుంచి 20 వరకు విక్రయించారు. ఇదే సమయంలో మిర్చి ధరలు మాత్రం వినియోగదారులను ఆందోళనకు గురిచే స్తున్నాయి. గత వారం కిలో మిర్చి రూ. 50నుంచి రూ. 60కి విక్రయించగా ఈ వారం ఏకంగా ఆధరలు  కిలో రూ.80కి పెరిగాయి. ప్రభుత్వం విదేశాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు అనుమతించటం, ప్రభుత్వమే డీసీఎంఎస్‌ల ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకోవటంతోనే ఉల్లి ధరల్లో తగ్గుదల నమోదైందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు