ఒక్కరే ఉండాలి...అది ఉన్నతాధి​కారే..

18 Jun, 2019 10:01 IST|Sakshi
కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు 

‘మీకోసం’లో సమూల మార్పులు 

కిందిస్థాయి అధికారులకు మినహాయింపు

వినూత్న చర్యలు చేపట్టిన కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు  

సాక్షి, ఏలూరు (మెట్రో): బాధ్యతలు స్వీకరించి వారం రోజులు కాకముందే వినూత్న పద్ధతులను అమలు చేస్తున్నారు కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు. జిల్లాలో ఇప్పటికే ఉన్నతాధికారులందరితోనూ సమావేశాన్ని నిర్వహించిన కలెక్టర్‌ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమంలోనూ మూస పద్ధతికి స్వస్తి పలికారు. సమూల మార్పులకు చర్యలు చేపట్టారు.  సోమవారం వచ్చిందంటే జిల్లా అధికారులంతా మూకుమ్మడిగా కలెక్టరేట్‌లో మీ కోసం కార్యక్రమానికి వస్తారు. మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌కు ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే ఆ ఫిర్యాదులను కలెక్టర్‌ సంబంధిత శాఖాధికారులకు అప్పగించి వాటి పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేస్తుంటారు.

ఇది ఇప్పటి వరకూ కొనసాగింది. అయితే  కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఈ పద్ధతిని మానేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం ప్రాధాన్యం కలిగిన  అధికారులు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదులు రానీ, వచ్చినా అరకొరా వచ్చే శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఉన్న శాఖల అధికారులు మాత్రమే  రావాలనీ, వచ్చిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

ఒక్కరే ఉండాలి... అదీ ఉన్నతాధికారే..
ఇప్పటివరకూ ప్రతి సోమవారం నిర్వహించే మీ కోసం కార్యక్రమానికి ఒక్కో శాఖ నుంచి ఇద్దరేసి అధికారులు హాజరవుతుండేవారు. వచ్చే సోమవారం నుంచి ప్రతి శాఖ నుంచి ఒక్కరు మాత్రమే మీ కోసం కార్యక్రమానికి హాజరు కావాలంటూ కలెక్టర్‌ ఆదేశాలిచ్చారు.  వచ్చే అధికారి కూడా ఆ శాఖ ఉన్నతాధికారి అయి ఉండాలని స్పష్టం చేశారు. కిందిస్థాయి సిబ్బందిని పంపిస్తే వారిపై చర్యలు ఉంటాయని కలెక్టర్‌ హెచ్చరించారు. అధికారులు ఎవరైనా జిల్లా దాటివెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా తన అనుమతి తీసుకోవాలని  ఆదేశించారు. 

తిప్పిపంపిన కలెక్టర్‌ 
ఫిర్యాదులు రాని శాఖలైన అగ్నిమాపక, రవాణా, చేనేత, ఆర్టీసీ, నెడ్‌క్యాప్, ఎల్డీఎం, జిల్లా మలేరియా, ఆడిట్, మహిళా కౌన్సిలర్‌ విభాగం, కమర్షియల్‌ టాక్స్‌  వంటి శాఖల అధికారులను కలెక్టర్‌ సోమవారం మీ కోసం కార్యక్రమం నుంచి  తిప్పి పంపించేశారు. ఈ సమయాన్ని ఇతర పనులకు కేటాయించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అదించాలని కలెక్టర్‌ సూచించారు.  

ఫిర్యాదుదారులకు ఫోన్‌
ప్రతి సోమవారం వచ్చిన ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా, కాలేదా, ఎందుకు కాలేదు వంటి వాటిపై ఇక నుంచి కలెక్టర్‌ ప్రత్యేకించి ప్రతి శుక్రవారం పరిశీలించనున్నారు.  పరిష్కారమయ్యాయని అధికారులు చెప్పే అర్జీలను పునఃపరిశీలించనున్నారు. కలెక్టర్‌ అప్పటికప్పుడు ఏదో ఒక ఫిర్యాదుదారునికి ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్‌ ముత్యాలరాజు కొత్త విధానాలను అమలు చేస్తున్నారు.

ఉద్యోగుల కోసమూ ‘మీ కోసం’ 
ఉద్యోగుల సమస్యలనూ పరిష్కరించేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులతో మీ కోసం కార్యక్రమాన్ని ప్రతినెలా నిర్వహించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తేనే ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలను ప్రతి ఉద్యోగి అందించగలుగుతారని ఆయన అభిప్రాయపడ్డారు. వీలైతే ఈనెల 21న ఉద్యోగుల మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని కలెక్టర్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.   

మరిన్ని వార్తలు