కొత్త బాస్‌కు పాత సవాళ్లు!

4 Nov, 2013 07:07 IST|Sakshi

 సాక్షి, నిజామాబాద్:

 ఠాణాల్లోనే సెటిల్‌మెంట్లు.. ఇసుక మాఫియాతో సత్సంబంధాలు.. నేతల కనుసన్నల్లో కేసుల నమోదు.. వివాదాల్లో ఎస్‌ఐలు, సీఐలు.. ఇదీ జిల్లాలో పోలీసుశాఖ పనితీరు. అస్తవ్యస్తంగా తయారైన సొంత శాఖను చక్కదిద్దుకోవడమే కొత్త బాస్ ముందున్న ప్రధాన సవాళ్లనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా ఎస్పీగా తరుణ్‌జోషి బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ పోలీసు సేవలను సామాన్య ప్రజ లకు చేరువ చేయడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కానీ సామాన్యుడు నేరుగా స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరగదేమోనన్న పరిస్థితి ఉంది. చోటామోటా నాయకులు, పైరవీకారులను ఆశ్రయిస్తే తప్ప పని జరగడం లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. కామారెడ్డి పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని పలు స్టేషన్‌లలో కేసుల నమోదు ఓ అధికార పార్టీ ప్రజాప్రతినిధి సోదరుడి కనుసన్నల్లో కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. సదరు నేత అండదండలు, అక్కడి శాఖాధికారుల తీరుతో స్టేషన్లలో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

 ‘ఇసుక’తో దోస్తీ..

 జిల్లాలో కాసులు కురిపిస్తున్న ఇసుక మాఫియాతో కొందరు సీఐ, ఎస్‌ఐలు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరి అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా మూడు టిప్పర్లు., ఆరు లారీలు అన్నచందంగా సాగుతోంది. ఇసుక వాహనాలు వెళ్తున్న సమయంలో ఏమైనా గొడవలు జరిగినా.. శాంతిభద్రతల సమస్య తలెత్తి నా ప్రజల పక్షాన ఉండాల్సిన పోలీసులు బహిరంగంగానే ఇసుక మాఫియాకు వంతపాడుతున్నారు. వివాదాలు తలెత్తితే కొందరు సీఐలు స్వయంగా గ్రామాల్లోకి  వెళ్లి తమదైన శైలిలో సెటిల్ చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవ చ్చు. బోధన్, ఆర్మూర్ సబ్‌డివిజన్లలో ఈ తర హా వ్యవహారాలు యథేచ్చగా కొనసాగుతున్నా  యని తెలుస్తోంది.

 

 సెటిల్‌మెంట్లు.. చేతివాటాలు..

 సివిల్ తగాదాలు, సెటిల్‌మెంట్లు.. ఇలా నగరం తో పాటు, నిజామాబాద్ సబ్‌డివిజన్ పరిధిలో ని పలు పోలీసుస్టేషన్లలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. లక్షల్లో రూపాయలు ముట్టజెప్పి కాసులు కురిపించే స్టేషన్లలో పోస్టింగ్ పొందుతున్న అధికారులు ఆ స్థాయిలోనే వెనుకేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. కేసు నమోదు మొదలుకుని.. స్టేషన్ బెయిల్ మంజూరు వరకు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల జిల్లాలో పలువురు పోలీసు అధికారు లు ఏసీబీకి చిక్కడమే ఇందుకు నిదర్శనం.

 

 వెంటాడుతున్న వివాదాలు..

 సీఐ, ఎస్సైస్థాయి అధికారులు సైతం వివాదాల్లో చిక్కుకుంటూ పోలీసు శాఖ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. పోలీసులపై రాజకీయ నేత ల ఒత్తిళ్లు తారాస్థాయిలో ఉండే జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తరుణ్‌జోషి పోలీసుశాఖను ఏమేరకు గాడిన పెడతారోననే అభిప్రాయం జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు