గిట్టబలంతో..‘పట్టు’దలతో..

19 Mar, 2018 08:39 IST|Sakshi
బండేమిటి.. కొండనైనా లాగేస్తాం..

హోరాహోరీగా ఎడ్ల పట్టు ప్రదర్శన

విజేత చింతలనామవరం జత

కడియం (రాజమహేంద్రవరం రూరల్‌) : మండలంలోని వీరవరం–దుళ్ళ రోడ్డుకు అనుబంధంగా ఉన్న పుంతదారిలో ఆదివారం ఎన్నడూ లేనంతగా దుమ్ము రేగింది. నందుల దమ్ము ఎంతో తేల్చే ఎడ్ల పట్టు ప్రదర్శనకు ఆ దారి వేదిక కావడమే అందుకు కారణం. వీరవరం–దుళ్ళ రోడ్లోని నందన్నబాబు గుడి వద్ద తీర్థ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా ఉగాది నాడు ఎడ్ల పట్టు ప్రదర్శన నిర్వహిస్తుంటారు. ఆ ఆనవాయితీ ప్రకారమే ఆదివారం ఏర్పాటు చేసిన ఎడ్ల పట్టు ప్రదర్శన హోరాహోరీగా సాగింది.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి  మొత్తం పన్నెండుజతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. నిర్ణీత దూరాన్ని 39.10 సెకన్లలో చేరుకున్న చింతలనామవరానికి చెందిన బొల్లి అనంతలక్ష్మీనారాయణ ఎడ్లు ప్రథమ స్థానంలో; 41.8 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న రాజవరానికి చెందిన గ్రామ రాము ఎడ్లు ద్వితీయ స్థానంలో; 44.66 సెకన్లలో చేరుకున్న ఏడిదసావరానికి చెందిన టేకిమూడి సత్యనారాయణ ఎడ్లు తృతీయస్థానంలో నిలిచాయి. కడియపుసావరానికి చెందిన ఆర్‌.రజనికి సాకుతున్న పుంగనూరు గిత్త  ప్రత్యేకాకర్షణగా నిలిచింది. విజేతలకు ఆలయ కమిటీ, మురమండ గ్రామ పెద్దలు నగదు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఏటా పోటీల నిర్వహణ చేపడుతున్న మొగలపు  చిన్నను పలువురు అభినందించారు. కడియం మండలంలోని గ్రామాల నుంచే కాక ఆలమూరు మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున యువకులు నందన్నబాబు ఆలయం వద్దకు చేరుకుని ఉత్కంఠభరితంగా సాగిన పోటీలను తిలకించారు.
 

మరిన్ని వార్తలు