మళ్లీ పంచాయతీ

2 Jan, 2014 04:23 IST|Sakshi
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. గత ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అభ్యంతరాలు, వివాదాలు తదితర కారణాలతో పలు పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. ఆ పంచాయతీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేసింది.  ఎన్నికల ప్రధానాధికారి పి.రమాకాంత్‌రెడ్డి విడుదల చేసిన ఉత్తర్వులు జిల్లాకు చేరాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్న మండలాల్లో నోటిఫికేషన్ విడుదల నుంచి ఫలితాల వెల్లడి తేది వరకు ‘ఎన్నికల కోడ్’ అమల్లో ఉంటుంది. జిల్లాలో మొత్తం 19 మండలాల్లో ఎన్నికల కోడ్ బుధవారం సాయంత్రం నుంచే అమల్లోకి వచ్చింది.  
 
ఎన్నికలు జరిగే పంచాయతీలు...
సర్పంచ్‌ల స్థానాలు ఇవే...
 శాసనం (కంచిలి), పట్టుపురం (కోటబొమ్మాళి), బుడితి (సారవకోట), కొల్లివలస (ఆమదాలవలస),
బుడుమూరు (లావేరు), చల్లయ్యవలస (పోలాకి), పొన్నుటూరు (కొత్తూరు), సంతబొమ్మాళి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  బుడుమూరు, సంతబొమ్మాళిల సర్పంచ్‌లు అకాల మృతితో ఎన్నిక జరుగుతోంది.
 
వార్డు స్థానాలు
శాసనం (కంచిలి)- మొత్తం 10 వార్డులు, పట్టుపురం (కోటబొమ్మాళి)- 8 వార్డులు, బుడితి (సారవకోట)- 12 వార్డులకు సర్పంచ్ స్థానాలతో సహా పూర్తి పాలకమండలికి ఎన్నికలు జరుగనున్నాయి. కొత్తూరు మండలంలోని పొన్నుటూరులో 7వవార్డు, కలిగాంలో 3వ వార్డులకు, బూర్జ మండలంలోని లంకాంలో 6వ వార్డు, లావేరు మండలంలోని పెద్దరావుపల్లిలో 2వ  వార్డు, సారవకోట మండలానికి చెందిన కరడశింగిలో 1వ,4వ,7వ వార్డులకు, ఆర్‌కె.పురంలో 7వ, తొగిరిలో 1వ,3వ,4వవార్డులు, చీడిపూడిలో 4వ వార్డుకు ఎన్నిక జరగనుంది.
 
సంతకవిటి మండలంలోని జిఎన్.పురంలో 1, 6వ వార్డులకు, మెళియాపుట్టి మండలంలోని గంగరాజపురంలో 4వ, 5వ వార్డులకు, పద్ద పంచాయితీలోని 3వ వార్డుకు, కంచిలి మండలం కె.బి.నవగాంలో 5, 6, 7, 9, 10వ వార్డులకు ఎన్నిక జరుగుతుంది. సోంపేట మండలంలోని టి.శాసనాంలో 4వ వార్డుకు, నందిగాం మండలంలోని మహాలింగపురంలో 7వవార్డు, ఇచ్ఛాపురం మండలంలోని పైతారిలో 7వ వార్డుకు, కోటబొమ్మాళి మండలంలోని దంతలో 4వవార్డు, కస్తూరిపాడులో 7వవార్డు, టెక్కలి మండలంలోని ముఖలింగాపురంలో 6వవార్డుకు ఎన్నికలు జరుగుతాయి.  కవిటి మండలంలోని కొజ్జీరియాలో 4, జగతిలో 3, 12వ వార్డులకు, డి.జి.పుట్టుగలో 1, 10వ వార్డులకు, వజ్రపుకొత్తూరు మండలంలోని పల్లిసారధిలో 10, పలాస మండలంలోని మామిడిమెట్టలో 7, నరసన్నపేట మండలంలోని జమ్ము పంచాయతీలోని 10వ వార్డుల స్థానానికి ఎన్నిక జరగనుంది.
 
బిజీబిజీగా పంచాయతీ అధికారులు
నూతన సంవత్సరం తొలి రోజే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లాలో పంచాయతీ అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. గతంలోలా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.  ఈనెల 3 నుంచే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో నేడు సంబంధిత పంచాయతీల్లో ఎన్నికల నోటిఫికేషన్ వివరాలను ప్రదర్శనలో పెట్టనున్నారు. ఈమేరకు బుధవారం సాయంత్రమే పంచాయితీ అధికారులకు సమాచారం పంపించారు. వివాదాలు తలెత్తే పంచాయతీల్లో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు సమాలోచనలు ప్రారంభించారు.  
 
ఎన్నికల షెడ్యూల్
జిల్లాలో మొత్తం 8 పంచాయతీ సర్పంచ్‌ల స్థానాలకు, 66 వార్డు స్థానాలకు ఈనెల 18న పోలింగ్ నిర్వహించనున్నారు. 
 ఈనెల 3 నుంచి 6 వతేది సాయంత్రం 5గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
 7న ఉదయం11 గంటల నుంచి నామినేషన్ల స్క్రూట్నీ
 8న సాయంత్రం 5 గంటల వరకు ఆర్డీవో కార్యాలయంలో పలు అప్పీళ్లు స్వీకరణ,
9న ఆర్డీవో సమక్షంలో అప్పీళ్ల డిస్పోజల్ 
ఈనెల 10న (మధ్యాహ్నం 3గంటల లోగా) నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ,  తర్వాత తుది జాబితా విడుదల
 18న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్  
18న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాల వెల్లడి...
పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కోడ్‌ను అతిక్రమించకుండా ఉండాలనేది ప్రధానం.
 
మరిన్ని వార్తలు