వివాదం రేపుతున్న జీవో 25

4 May, 2015 05:04 IST|Sakshi

- ఆహ్వానిస్తున్న రెల్లి కులస్తులు
- వ్యతిరేకిస్తున్న మాలలు
 ఏయూ క్యాంపస్ :
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 25 వివాదానికి కారణమవుతోంది. దళితుల మధ్య చిచ్చురేపుతోంది. ఇప్పటికే వర్సిటీలో ఈ జీఓపై నిరసనలు పెరుగుతున్నాయి. రెల్లి హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఈ జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేయగా, మాల విద్యార్థి ఫెడరేషన్ ప్రతినిధులు నిరాహార దీక్ష ప్రారంభించారు.  

రావెలను పదవి నుంచి తొలగించాలి
దళితుల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా జీవో విడుదల చేసిన మంత్రి రావెల కిషోర్‌బాబును వెంటనే బర్తరఫ్ చేయాలని మాల విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ఈ జీవోను వెంటనే వెనక్కితీసుకోవాలని కోరుతూ ఏయూ ప్రధాన ద్వారం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. కన్వీనర్ కె.వీర కృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించే విధగా మంత్రి పనితీరు ఉందన్నారు. ఎస్సీ ఉప కులాలపై తప్పుడు గణాకాలు  చూపుతున్నారని ఆరోపించారు. జీవోను రద్దు చేయకుంటే ఆమరణ దీక్షలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.సతీష్, ఐ.వి.కృష్ణ, ఇ.సుబ్బయ్య, వి.రామస్వామి, ఎం.స్వరూప, జె.త్రిమూర్తులు, సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణతోనే రెల్లీలకు న్యాయం
షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిపితేనే రెల్లి కులస్తులకు తగిన న్యాయం జరుగుతుందని రెల్లి హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ డి.ఆడమ్స్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులను అన్ని కులాలకు చెందే విధంగా విడుదల చేసిన జీవో 25పై హర్షం వ్యక్తం చేశారు. ఏయూ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం పలికారు. ఎస్సీలలో మాల, మాదిగలకు ఇస్తున్న ప్రాధాన్యత మూడో కులమైన రెల్లికి ఎందుకు కల్పించడం లేద ని ప్రశ్నించారు.

ఎస్సీ  ఉపకులాల జనాభా నిష్పత్తి ఆధారంగా సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రకటించడం పట్ల హర్షం ప్రకటించారు. జిల్లా రెల్లి మేధో ఫోరం అధ్యక్షుడు ఇసుకపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించిందన్నారు. ఈ జీవో ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డాది మధు, చెన్నా తిరుమల రావు, మల్లిపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు