దయనీయం.. కళావిహీనం!

13 Aug, 2019 09:40 IST|Sakshi

మడ్డువలస ప్రాజెక్టుపై నిర్లక్ష్యం నీడలు

అభివృద్ధిని గాలికొదిలేసిన గత ప్రభుత్వం

దయనీయంగా డైక్, రహదారి, విద్యుత్‌ దీపాలు 

మరమ్మతులకు నోచుకోని గేట్లు, రివిట్‌మెంట్, రక్షణగోడ

సిబ్బంది కొరత.. ప్రాజెక్టు ముఖం చూడని అధికారులు

తలమానికంగా నిలవాల్సిన ప్రాజెక్టు కళావిహీనమైంది.. పది వేల ఎకరాల్లో రూ.100 కోట్లు వెచ్చించి దీనిని నిర్మించారు.. తొలి దశలో 24,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించారు.. రెండో దశ పూర్తయితే మరో 12,500 ఎకరాలు సస్యశ్యామలం కావాల్సివుంది. కానీ మడ్డువలస ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలింది. గత ప్రభుత్వ వైఫల్యం... అధికారుల నిర్లక్ష్యం ప్రాజెక్టును పీడిస్తున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలోనే రెండో దశకు ఆమోదం పలికినా.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అరకొర నిధులు మంజూరు చేయడంతో కార్యరూపం దాల్చలేదు. కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ సైతం సరిగా లేకపోవడంతో పథకం పరిస్థితి దయనీయంగా మిగిలింది. మడ్డువలస ప్రాజెక్టు స్థితిగతులపై సాక్షి ఫోకస్‌.. 

వంగర: నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మిగిలిన మడ్డువలస ప్రాజెక్టు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ముఖద్వారం నుంచి హెడ్‌ భాగం వరకు అన్నీ సమస్యలే. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన ముఖద్వారం నిర్మాణం అర్ధంతరంగా వదిలేశారు. అక్కడ నుంచి వెళ్లే రాళ్లదారి అధ్వానంగా తయారైంది. డైక్‌ భాగమంతా బురదమయంగా ఉంది. ఈ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మించాల్సి ఉండగా ఎటువంటి చర్యలు లేక ఈ పరిస్థితి దాపరించింది. పలు చోట్ల రాతి రివిట్‌మెంట్‌ దిగజారినప్పటికీ మెరుగుపరిచేందుకు అధికారుల చర్యలు శూన్యం. ప్రాజెక్టు జనరేటర్లు, లైట్ల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ లైన్‌ నేలపై ప్రమాదకరంగా ఉంది. వైర్లపై అడుగుపడితే ప్రాణాపాయమే. నీటినిల్వను కొలిచే ప్రదేశంలో ఉన్న దిమ్మలు, బోర్డులు శిథిలమయ్యాయి. బకేట్‌ పోర్షన్‌కు వెళ్లే ప్రదేశంలో పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి.

గత ప్రభుత్వ పాపం..
చంద్రబాబు హయాంలో (2014–2019) మూడుసార్లు రూ.9 కోట్లు మంజూరు కాగా ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మూడు నెలలకే రూ.9.50 కోట్లు మంజూరు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో దీనినిబట్టి అర్థమవుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెండో దశలో భాగంగా ఆధునికీకరణ పనుల ఫైలుకు ఆమోదం పలికారు. అనంతరం 2011లో సీఎం రోశయ్య రూ.47 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ఒకసారి రూ.11 కోట్లు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో మ రో రూ.14 కోట్లు కేటాయించారు. చంద్రబాబు సీఎం అయ్యాక నిధుల కేటాయింపు లేక పరిస్థితి మరింత దిగజారింది. ప్రస్తుతం రెండో దశ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆధునీకరణ నిధుల్లో భాగంగా ప్రాజెక్టు హెడ్‌ భాగంలో అత్యవసర గేట్లు, గేట్లు, హెడ్‌ స్లూయీస్‌ల మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా ఆ ఛాయలే లేవు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్వాసితులుగా మిగిలిన ఏడు గ్రామాల వారికి వైఎస్సార్‌ రూ.27 కోట్లు మంజూరు చేసి వారికి అండగా నిలిచారు. అనంతరం ఈ ప్రాజెక్టుకు జనరేటర్లు, డీజిల్‌ కొనుగోలు, పిచ్చిమొక్కలు తొలగింపునకు ప్రతి ఏటా వేలల్లో మాత్రమే మంజూరు చేశారు తప్ప శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు.

అత్యంత ప్రధాన సమస్యలు ఇవీ..
చిన్నపాటి రైస్‌మిల్లు నిర్మిస్తే త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఉంటుంది. జిల్లాలో 9 మండలాల్లో 37,285 ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టుకు మాత్రం త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా లేదు. ప్రతీ రోజు నాలుగు గంటలు మాత్రమే త్రీఫేజ్, మిగతా సమయం 2 ఫేజ్‌ మాత్రమే ఉంటుంది. వరదలు అధికంగా ఉండేటప్పుడు గేట్లు ఎత్తాలంటే త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా అవసరం. ప్రత్యామ్నాయంగా రెండు జనరేటర్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి పాడై మరమ్మతుల కోసం ఎదురుచూస్తోంది. ఉన్న ఒకటి పాడైతే వరదల సమయంలో పరిస్థితి ఏమిటిః ఇటువంటి ప్రధాన సమస్యపై దృష్టి పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ప్రజలు, రైతులు అధికారులను హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నైట్‌వాచ్‌మెన్, లస్కర్లు లేకపోవడంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులు, విద్యార్థులను అదుపు చేసే నాథులు కరువవుతున్నారు. సిబ్బంది పహరా లేకపోవడంతో ప్రాజెక్టు ఆవరణలో బకెట్‌ పోర్షన్‌లో దిగి గడిచిన పదేళ్లలో 8 మంది విద్యార్థులు, యువకులు మృత్యువాత పడ్డారు. 

మరమ్మతులు కరువు..
ప్రధానంగా ప్రాజెక్టు బకేట్‌ పోర్షన్‌లో ఉన్న 11 గేట్లలో మూడు గేట్లు పాడయ్యాయి. టీడీపీ హయాంలో రూ.13 లక్షల నీరు–చెట్టు నిధులతో గేట్లను తూతూమంత్రంగా సరిచేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత గేట్లకు మళ్లీ లీకులు ప్రారంభమయ్యాయి. గేట్లను ఆనుకొని ఉన్న 24 రోప్‌లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో సాగునీరు వృథా అవుతోంది. ఇది మినహా ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదు. నదిని ఆనుకొని రివిట్‌మెంట్, రక్షణ గోడ పూర్తిగా శిథిలమైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. వరదలు సమయంలో ఇవి ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయాల్సిన అత్యవసర గేట్ల మెటీరియల్‌ ఇక్కడే వృథాగా పడి ఉంది.

పర్యాటక శోభకు నోచుకోని మడ్డువలస...
మడ్డువలస ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని గత పాలకులు హామీ ఇచ్చినా ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. పర్యాటక కేంద్రం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలం కూడా కళావిహీనంగా ఉంది. పార్కు నిర్మించి, బోటు షికారు ఏర్పాటు చేస్తే పర్యాటకులు తాకిడి అధికమవుతుంది. అదే విధంగా ఈ ప్రాంతానికి ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న త్రివేణి సంగమం, పవిత్ర సంగమేశ్వరస్వామి దేవాలయాలను వీక్షించవచ్చు. తద్వారా అభివృద్ధి చెందవచ్చు.

అధికారులు రారు.. సిబ్బంది లేరు..
వర్షాలు, వరదల సమయంలో మినహా ప్రాజెక్టు వద్ద అధికారులు కనిపించరు. ఇంజినీర్లు రా జాంలోని కార్యాలయంలో ముఖం చూపించి వెళ్లిపోతుంటారు. ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. మడ్డువలస ప్రాజెక్టుకు అధి కారులు, లస్కర్లు, ఎలక్ట్రీషియన్లు, వాచ్‌మెన్‌ మొత్తం 51 మంది ఉండాలి. ప్రస్తుతం ఒక ఈఈ, ఒక డీఈ, నలుగురు జేఈలు, ఒక లస్కరు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఒక జేఈ, లస్కర్లు 27మంది, ఎలక్ట్రీషియన్లు ఇద్దరు, ఫిట్టర్లు ముగ్గురు, వాచ్‌మెన్లు ముగ్గురు, హెల్ప ర్లు ఎనిమిది మంది ఇంకా అవసరం ఉంది. ప్రాజెక్టు హెడ్‌ వద్ద ఒక లస్కర్‌ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

 ఆశలు ఫలిస్తాయని రైతుల ఆకాంక్ష..
గత ప్రభుత్వాలు మడ్డువలసను పట్టించుకోకపోవడంతో అభివృద్ధి జరగలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలో మడ్డువలస అభివృద్ధికి సీఎం బాటలు వేస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిపాదనలు పంపించాం..
ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన నిధులు, సిబ్బంది కొరత, గేట్లు మరమ్మతులు వంటి సమస్యలపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి జనరేటర్ల మరమ్మతులు, డీజిల్‌ కొనుగోళ్లు మినహా నిర్వహణ (మెయింటినెన్స్‌) కోసం నిధులు మంజూరు అవడంలేదు. ప్రస్తుతం పంపించిన ప్రతిపాదనల మేరకు నిధులు మంజూరైతే సమస్యలు పరిష్కరిస్తాం. 
–నర్మదా పట్నాయక్, డీఈ, మడ్డువలస

అంధకారంలో ప్రాజెక్టు..
మడ్డువలస ప్రాజెక్టు రాత్రి సమయంలో అంధకారంలో ఉంటుంది. ఇక్కడ 34 విద్యు త్‌ స్తంభాలున్నాయి. వీటికి అమర్చిన ఎల్‌ఈడీ బల్బులు ఏడాది క్రితమే పాడవ్వడంతో ప్రాజెక్టు అంధకారంలో ఉంది. వరదలు, తుఫానులు సమయమిది. ఇటువంటి సమయంలో ప్రాజెక్టు వద్ద అంధకారంలో ఉండడంతో రాత్రి సమయంలో రీడింగ్‌ బోర్డులు కనిపించక వరదలను గుర్తించలేని పరిస్థితి. ఇక్కడ కొన్ని విద్యుత్‌ స్తంభాలు బల్బులు లేకుండా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు