బాబు మాటలు మయసభను మించిపోయాయ్

11 Aug, 2014 00:45 IST|Sakshi
బాబు మాటలు మయసభను మించిపోయాయ్

ఎన్నికల హామీలన్నీ నెరవేర్చకుంటే ఊరుకోం
ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన పీసీసీ

 
తిరుపతి: నయవంచనకు మారుపేరైన చంద్రబాబు మాటలు..ఆనాటి ఎన్టీఆర్ సినిమాలోని మయసభను మించిపోయాయని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చేపట్టనున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా తొలి సమావేశం ఆదివారం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, రాజ్యసభ సభ్యుడు కేవీపీ.రామచంద్రరావు, మాజీ మంత్రులు శైలజానాథ్, సి.రామచంద్రయ్యతో పాటు దేవినేని నెహ్రూ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ నిత్యావసరాల ధరల అంశాన్ని మొన్నటి ఎన్నికల వాగ్దానాల్లో గొప్పగా ప్రస్తావించిన నరేంద్రమోడీ, చంద్రబాబు ఇప్పుడు ప్రతి వస్తువు ధరను విపరీతంగా పెంచి ప్రజలను మోసం చేశారన్నారు.

బాబు ఎన్నికల సమయంలో ప్రకటించిన ప్రతి హామీని నెరవేర్చాలని, లేకుంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామన్నారు.  చంద్రబాబు మాటల్లో ‘బాబొస్తే జాబొస్తుంది’ అనే పదానికి అర్థమే వేరన్నారు. ‘జాబంటే’ అమాయక జనం ఉద్యోగాలనుకున్నారేమో గానీ...చంద్రబాబు మాటల్లో రైతుల నగలు, ఆస్తులు వేలం వేసేందుకు, వేలాది మంది ఆదర్శరైతులను, ఉపాధిహామీ సిబ్బందిని, కాంట్రాక్ట్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఇళ్లకు వచ్చే జాబులని ఎద్దేవా చేశారు. గతంలోనే తొమ్మిదేళ్ల పాటు చంద్రబాబు పాలనలో అన్ని విధాలా కష్టాలు అనుభవించిన జనం మళ్లీ ఆయన మాయమాటలు నమ్మి ఓట్లేసి అధికారం ఇస్తే చివరకు దగా చేశారని ధ్వజమెత్తారు.
 

మరిన్ని వార్తలు